'జననేత జగన్‌తోనే జనరంజక పరిపాలన'
17 Jan, 2013 15:01 IST
ఖమ్మం : జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో జనరంజక పాలన సాధ్యం అవుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. దివంగత మహానేత డాక్డర్ వైయస్ రాజశేఖరరెడ్డి జనరంజకమైన పాలన అందించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జిల్లాలోని బనిగండ్లపాడులో బుధవారం రాత్రి ఆయన మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామంలోని బి.సి, ఎస్సీ కాలనీలలో పార్టీ జెండాలను ఎగురవేశారు. గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీల నుంచి 300 మంది వైయస్‌ఆర్‌సిపిలో చేరారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు నిర్వీర్యం చేశారని విమర్శించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఏం తప్పు చేశారని జైల్లో నిర్బంధించారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టిడిపిలు కుట్ర పన్ని శ్రీ జగన్‌ను జైలుపాలు చేశాయని అన్నారు. ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసులలో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో శ్రీ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని అజయ్‌కుమార్ అన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నరకం చూపించారని విమర్శించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్ని వేషాలు వేసినా 2009 ఎన్నికలలో వైయస్‌ఆర్ చరిష్మా ముందు నిలువలేకపోయారని ఎద్దేవా చేశారు. అబద్దాల చంద్రబాబు హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా చూపిస్తే దివంగత మహానేత వైయస్‌ఆర్ పల్లెలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమాలను వైయస్ రెండు కళ్లలా చూశారని చెప్పారు. వైయస్‌ఆర్ పరిపాలన ఓ స్వర్ణయుగం అని కొనియాడారు. మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ పాలనలో ఏనాడూ ప్రజలు ఇబ్బంది పడలేదని, ధరలు పెరగలేదని పువ్వాడ చెప్పారు.