టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ
రాష్ట్రవిభజనపై కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర నుంచి సర్వత్రా విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి. జనక్ ప్రసాద్ మండిపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అసమర్ధ ప్రభుత్వాలు పాలిస్తున్నాయంటూ దుయ్యబట్టారు. అడ్డగోలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నవారిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి, దేశవ్యాప్తంగా ఆర్టికల్ 3పై ఏకాభిప్రాయం సాధించడానికి తమ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కృషి చేశారని చెప్పారు.
మన రాష్ట్రాన్ని కేంద్రం విభజన చేస్తుంటే చంద్రబాబు సమైక్యం అనే మాట ఎందుకు మాట్లాడటం లేదని జనక్ ప్రసాద్ ఘాటుగా ప్రశ్నించారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబూ మీకు చిత్తశుద్ది ఉంటే గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ ఉపసంహరించుకోండని జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. తొంభై మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందా? అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు కేవలం నలుగురు ఎంపీలతో ఇప్పుడు అవిశ్వాసం ఎలా పెట్టించారని నిలదీశారు. మరో ఇద్దరు టీడీపీ ఎంపీలను కూడా అవిశ్వాసం నోటీసుపై ఎందుకు సంతకం పెట్టించలేకపోయారని ప్రశ్నించారు.