జనాభిమానం 'వర్షించింది'...

22 Oct, 2012 15:57 IST


హైదరాబాద్, 21, అక్టోబర్‌ 2012 : వైయస్‌ అంటే వర్షం. వర్షం అంటే వైయస్. వరుణుడు మా పార్టీయేనని వైయస్‌ తరచూ చమత్కరించేవారు. చివరకు దట్టమైన మబ్బులు కమ్మిననాడే ఆయన మనకు దూరమయ్యారు. ఆయన పార్థివ కాయాన్ని ఖననం చేశాక కూడా భారీ వర్షం కురిసింది. అలా వైయస్‌కూ వానకూ ఏదో అవినాభావ సంబంధం ఉంది. వైయస్‌ అడుగుపెడితే చాలు, వాన పడుతుందని జనం నమ్మిక. వైయస్‌ కుమార్తె షర్మిలకూ అదే వారసత్వం అబ్బినట్లుంది. ఎన్నాళ్లుగానో ముఖం చాటేసిన వానదేవుడు ఆమె పాదయాత్ర మొదలయ్యాక కరుణించాడు. భారీ వర్షంతో షర్మిల ప్రస్థానాన్ని ఆశీర్వదించాడు. వాన హోరులోనే ఆమె పాదయాత్ర సాగింది. తడుస్తూనే ఆమె జనం సమస్యలు ఆలకించారు. లింగాలలో భారీ వర్షంలోనే ఆమె ప్రసంగం సాగింది. ఇది ఒక విశేషం.
మరో విశేషమేమిటంటే వైయస్‌కే సొంతమైన అయిన చిరునవ్వు. నాలుగు రోజుల పాదయాత్ర తర్వాత కూడా షర్మిల ముఖంలో కూడా చిరునవ్వు చెరగలేదు. గోడు వెళ్లుబోసుకుంటున్న జనం బాధలు వింటూ, ఓదార్చుతూ, అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ, త్వరలోనే జగనన్న నాయకత్వంలో రాజన్నరాజ్యం వస్తుందని భరోసా ఇస్తూ షర్మిల చిర్నవ్వుతోనే పాదయాత్ర సాగించారు.
నాలుగోరోజు పాదయాత్ర  ఆదివారం పులివెందులలోని ఋషి పాఠశాల నుంచి లోపన్నూతల క్రాస్ వరకు 16.2 కిలోమీటర్ల దూరం  సాగింది.
పలు చోట్ల షర్మిలకు మహిళలు గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్నారు. హారతులిస్తున్నారు. తిలకం దిద్దుతున్నారు. జై జగన్.. జై షర్మిల అంటూ నినాదాలు చేస్తున్నారు. పూలబాటలు పరచి నడిపిస్తున్నారు. కరచాలనం చేసేందుకు ఆరాటపడుతున్నారు.
కరెంటు, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయనీ,. కనీసం నష్టపరిహారం ఇచ్చేవారు  కూడా లేరని,  ప్రజలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడనీ జనం షర్మిలతో వాపోయారు. రైతులు కన్నీరు పెట్టుకుంటూ తమ బాధలు చెప్పుకున్నారు. ప్రతి పల్లెదీ ఇదే పరిస్థితి. అందుకే తమ వెతలు వినేందుకు వచ్చిన షర్మిలకు జనం ప్రతి చోటా బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, రాజన్న రాజ్యం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలను ఓదార్చుతూ షర్మిల ముందుకు కదిలారు. రాజశేఖర్ రెడ్డిగారికి ఉన్న పెద్దమనుసు ఇప్పుడున్న నాయకులలో ఎవ్వరికీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.
ఆమె ఆప్యాయంగా చేయి ఊపుతుంటే జనం వైయస్‌ను గుర్తు తెచ్చుకుని సంబరపడ్డారు. నాలుగోరోజు పాదయాత్రలో వైఎస్ విజయమ్మ షర్మిల వెన్నంటే ఉన్నారు. వైఎస్ జగన్ సతీమణి భారతి భోజన విరామ సమయంలో పాదయాత్రలో పాల్గొన్నారు.
నిద్రపోతున్న ముఖ్యమంత్రి:
ప్రధానంగా విద్యుత్, సాగునీరు, పింఛన్లు తదితర సమస్యలను జనం షర్మిల దృష్టికి తెచ్చారు. పులివెందులలో ఓ విద్యార్థిని చదువుకోవడానికి కరెంటు లేదమ్మా.. అని మొరపెట్టుకుంటే,. స్పందించిన షర్మిల కరెంటు కొనుక్కొవడంలో మన ముఖ్యమంత్రి ఆలస్యం చేశారనీ, ఆయన నిద్రపోతుంటే మిగతా రాష్ట్రాల వారు ఆ కరెంటును తీసుకుపోయారనీ జవాబిచ్చారు.. ప్రాజెక్టులు అలమారలో పెట్టి తాళం వేశారని అనగానే 'అవునమ్మా! నిజమే' అంటూ కరతాళధ్వనులు చేశారు. రైతు రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని, రాజన్న రాజ్యంలో ఎవరికీ సమస్యలే ఉండవనీ ఆమె వారిని ఓదార్చారు.
పాదయాత్రలో వికలాంగులు కూడా షర్మిలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ధ్రువీకరణపత్రాల పేరుతో రాష్ట్రలో 1.83 లక్షల పింఛన్లను ఒక్క కలంపోటుతో తొలగించారని, దీంతో వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని షర్మిలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాక్షస ప్రభుత్వం.. జగన్ సీఎం అయితే వికలాంగులకు రూ. 1000 పింఛన్ ఇస్తారని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం మూలె లీలావతి నాగిరెడ్డి స్మారక వృద్ధాశ్రమం వద్ద వయోధికులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
యాత్ర సాగిందిలా...
పులివెందులలోని పాత ఋషి పాఠశాల నుంచి ఆదివారం ఉదయం 9.35 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. 9.50 గంటలకు రాజీవ్ నగర్ కాలనీ, 10.20కి చిన్న రంగాపురం చేరుకుని వైఎస్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. 10.45 గంటలకు వృద్ధుల అనాథాశ్రమం, 11.15 గంటలకు ఇప్పట్ల క్రాస్, 2.20 గంటలకు కోమన్నూతల క్రాస్‌కు చేరుకున్నారు. మార్గమధ్యంలో టమాటా, వేరుశనగ తోటలను పరిశీలించారు. కాసేపు విశ్రమించారు. అనంతరం 4.15కు యాత్ర ప్రారంభమైంది. 4.50కి పెద్దకుడాల, 6.40కి లింగాల చేరుకున్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయక వేలాది మంది జనాలు తోడురాగా యాత్ర కొనసాగించారు. లింగాలలో వర్షంలో తడుస్తునే ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, కొల్లి నిర్మల, వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, భూమన కరుణాకరరెడ్డి, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాపు భారతి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేశ్‌బాబు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, కొల్లం బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు గోసుల శివభారత్ రెడ్డి, కడప నగర ఇన్‌చార్జ్ అంజద్‌బాషా, హపీజుల్లా (కాల్‌టెక్స్), ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, పులివెందుల మాజీ చైర్‌పర్సన్ రుక్మిణమ్మ, పులివెందుల మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, ఈసీ దినేశ్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యులు ప్రసాదరాజు, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వైఎస్ వియ్యంకుడు ఈసీ గంగిరెడ్డి,మాసీమ బాబు, జయచంద్రారెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. లింగాల మండలం లోపట్నూతల క్రాస్‌లో ఆమె ఆదివారం రాత్రి బస చేశారు.