జనం మెచ్చిన జగన్ మేనిఫెస్టో

14 May, 2018 10:33 IST

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 2000కిలోమీటర్ల మైలు రాయికి చేరువైంది. ఎన్ని ప్రతిపకూలతలెదురైనా యువనేత మాట తప్పలేదు, మడం తిప్పలేదు. ప్రజా సంకల్పం లో అడుగడుగునా ప్రజా సమస్యలను వింటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.



అసమర్థ పాలనపై ప్రశ్నాస్త్రం

చంద్రబాబు ఎన్నికల మేనెఫెస్టోలో అమలు చేయకుండా వదిలేసిన డ్వాక్రా, రైతు రుణమాఫీలపై యాత్రలో ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ, నిరుద్యోగభృతి, విద్యార్థుల ఫీజ్ రీయంబర్స్ మెంట్, చేనేత సమస్యలు, ప్రాజెక్టుల నత్తనడక, అవినీతి, కుంభకోణాలు ఇలా ప్రతి ప్రతికూల అంశాన్నీ ఆయుధంగా ఎక్కుపెట్టి ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రంగా సంధిస్తున్నారు. బిసిలు, ఎస్సీఎస్టీలు, మైనారిటీల సమస్యలు, వారిని చంద్రబాబు మోసం చేస్తున్న విధానాలపై విరుచుకు పడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలి, ఢిల్లీ గల్లీలు చక్కర్లు కొట్టడం వెనుక రహస్యాలను బైట పెడుతున్నారు. పెట్టుబడులు లేకుండానే పరిశ్రమల కథల్లో నిజాలను వెలికి తీసి చెబుతున్నారు. రాజధాని పేరుతో రాష్ట్రానికి చేసిన వంచనను తెలియజేస్తున్నారు. కేంద్రంతో కుమ్మక్కయి, స్వార్థ ప్రయోజనాల కోసం విభజన హామీలకు పాతరేసినందుకు ముక్కు చివాట్లు పెడుతున్నారు. అధిష్టానంతో యుద్ధం చేస్తూ, కలిసికట్టుగా పోరాటానికి రమ్మని పిలుపునిస్తే కాదన్న అహంకారాన్ని ప్రజావేదికల మీదే నిష్కర్షగా దుయ్యబడుతున్నారు. ప్రజా సంకల్పం అడుగడుగునా ప్రజల వేదనే ప్రతిఫలిస్తోందంటున్నారు వైఎస్ జగన్.

యువనేత ప్రకటిస్తున్న ప్రజల మేనిఫెస్టో

జగమెరిగిన వాడు జగద్విజేత అయితే..జనుల మనసెరిగిన వాడే జన నేత. అది ఖచ్చితంగా వైఎస్ జగనే. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటాడాయన. అక్కడి భౌగోళిక, సామాజిక, మానవ వనరుల లభ్యత దృష్ట్యా ఆ ప్రాంత అభివృద్ధికి అవసరమైన సాయాన్నే హామీగా ఇస్తున్నాడాయన.

రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమల గురించి మాట్లాడారు వైఎస్ జగన్. కరువు కోరల్లో చిక్కిన నాలుగు సీమ జిల్లాల్లో తాగు, సాగునీటి అవసరాల గురించి స్పష్టంగా చెప్పారు. ఏ ప్రాంతాల్లో ఖనిజనిక్షేపాలున్నాయో, ఎక్కడ ఏ తరహా పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందో వివరంగా చెప్పారు. ప్రభుత్వం రాయలసీమ జిల్లాలను ఎలా వివక్షకు గురి చేసిందో కూడా కళ్లకు కట్టినట్టు తెలియచేసారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కరువు సీమలో నీటి కొరత తీర్చి, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కోస్తా జిల్లాల్లో పచ్చని చేలను నాశనం చేసి, వేల ఎకరాలను బలవంతంగా సేకరించి ఒక్క నిర్మాణమూ చేయని సర్కార్ పై విమర్శలు గురిపెట్టారు వైఎస్ జగన్. శాశ్వత నిర్మాణాలు చేయక, రాజధాని నిర్మాణం మొదలవ్వక, ఉపాధి లేక కోస్తా జిల్లాలు కూడా వలస బాట పట్టాయని తెలియజేసారు. ప్రభుత్వ అసమర్థత, రాజధాని భూములతో రియలెస్టేట్ వ్యాపారం గుట్టు ప్రజల ముందు రట్టు చేసారు. కోస్తా రైతుల కష్టాలను ప్రజా వేదికల్లో తెలియజెప్పారు. అవినీతి విశ్వరూపం ఈ జిల్లాల్లో ఎలా జడలు విప్పుకుందో వివరించారు. అధికారులు, నేతలు కలిసి ప్రజలపై చేస్తున్న జులుంను ప్రత్యక్షంగా నిరూపించారు. పచ్చని పంటపొలాలు ఉన్న జిల్లాల్లో రైతులు సంతోషంగా ఉండాలి కాని గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆక్రోశిస్తున్నారన్నారు వైస్ జగన్. వారికి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగంలో కొట్టు మిట్టాడుతున్న యువతకు ప్రత్యేక హోదా సాధించి ఉపాధి కల్పనకు బాటుల వేస్తామని మాటిచ్చారు.

ప్రతి కులానికీ ఓ కార్పొరేషన్ ఏర్పరిచి, ఆర్థికంగా వెనకబడ్డ వారికి సాయం అందిస్తామన్నారు. పేదలకు ఉచిత కరెంటు, సెలూన్లకు, ఉచిత కరెంటు, బడికి వెళ్లే పిల్లలకు 15వేలు, పైచదువులు చదివే యువకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ తో పాటు 20000 భృతి, 45 ఏళ్లకే ఫించన్లు, చేనేతలకు ఇల్లు, రుణాలు, గ్రామ సచివాలయం ద్వారా గ్రామీణ సేవలన్నీ ఒకే చోట, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మూతబడ్డ ప్రభుత్వ సంస్థలను తిరిగి పునరుద్ధరించడం, ఆగిపోయిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, మండలానికో వృద్ధాశ్రమం, ఫించన్ల పెంపు, న్యాయవాదులకు ప్రత్యేక నిధి, బిసిల డిక్లరేషన్ ఇలా...ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా వైఎస్ జగన్ ప్రజా మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. ప్రజల అవసరాలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని, వారు కోరిన వాటినే హామీలుగా ప్రకటిస్తున్న యువనేత కు కృతజ్ఞతలు చెబుతున్నారు ప్రజలు. మాటతప్పని ఆ మహానేత వారసుడిపై నమ్మకముందని అశేషంగా తరలి వచ్చి రుజువు చేస్తున్నారు.