జగన్‌పై కక్షసాధింపులకు వెల్లువెత్తిన నిరసన

28 Nov, 2012 14:08 IST
హైదరాబాద్, 28 నవంబర్ 2012:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆరు మాసాలుగా జైలులో ఉంచడం ప్రజాస్వామ్మానికి సంకెళ్లు వేయడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. మంత్రి ధర్మానకు ఒక న్యాయం, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అంటూ నేతలు ప్రశ్నించారు. కేసులను చట్టప్రకారం కాకుండా ఇష్టానుసారం విచారిస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేవాలయాలు, మసీదులు, చర్సీలల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు  ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

     వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో పెట్టినా జనం ఆయనను తమ హృదయాల్లో పెట్టుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. పాలకుల కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.

     జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పి.గౌతమ్‌రెడ్డి కష్ణా జిల్లా సత్యనారాయణపురంలో కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. స్థానిక భగత్‌సింగ్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి బాబూరావు మేడ సెంటర్, శివాలయం వీధి మీదుగా శివాజీకేఫ్ సెంటర్‌కు చేరుకుంది. పార్టీ నేతలతోపాటు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

     గుంటూరు జిల్లాలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరు పేదల కోసం పోరాడుతున్న వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అన్నారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.
 
      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న జనాదరణను చూసి ఓర్వలేకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసులతో జైలుకు పంపించారని నెల్లూరు జిల్లా నేతలు ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ మంగళవారం బారాషహీద్ దర్గాలోని స్వర్ణాల చెరువులో రొట్టెలను వదిలారు. రొట్టెల పండగ సందర్భంగా వారు ఈ కార్యక్రమం నిర్వహించారు.

      వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు మానాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా మదనపల్లెలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం మౌనప్రదర్శన చేశారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకూ  వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

       అక్రమ కేసులు బనాయించి జననేత జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి ఆరు నెలలు దాటినా విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఈద్గా వద్ద ముస్లింలు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.