'జగన్ కోసం జనమే ప్రత్యక్ష పోరాటం చేస్తారు'

31 Jan, 2013 11:56 IST
అవనిగడ్డ (కృష్ణాజిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని విడుదల చేయకపోతే ప్రజలే రంగంలోకి దిగి ఆయన కోసం ప్రత్యక్ష పోరాటం చేసే పరిస్థితి వస్తుందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరరావు హెచ్చరించారు. ఈ సంవత్సరం మార్చి నెల లోగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలై వస్తారని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. అలా కాని పక్షంలో జనం జాగృతం అవుతారని జూపూడి అన్నారు. వైయస్‌ఆర్ స్వచ్ఛంద సే‌వా సంస్థ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి, వైయస్‌ఆర్ సంస్మరణా‌ర్థం అవనిగడ్డ టిటిడి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన మహారక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ దాసి దేవదర్శనం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఎనిమిది నెలలుగా జైలులో ఉన్నప్పటికీ శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రా‌నివ్వకుండా టిడిపి, కాంగ్రెస్, ‌సిబిఐ కుమ్మకై రాజకీయాలు చేస్తున్నాయని జూపూడి ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలు శ్రీ జగన్ చుట్టూ‌నే తిరుగుతున్నాయన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సిపికి 191 స్థానాలు, 32 ఎం.పి. సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఎం.పి. లగడపాటి రాజగోపాల్ సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు.

వైయస్‌ఆర్‌సిపి నాయకుడు, మాజీ మంత్రి మారెప్ప మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పాదయాత్ర ద్వారా ప్రజలకు అబద్ధాలుచెప్పి, అనారోగ్యం పాలయ్యారన్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సమకూరిన రక్తాన్ని చంద్రబాబుకు ఎక్కిస్తే ఇక ముందు అయినా నిజాలు చెబుతారేమో అని చమత్కరించారు. పార్టీ పాలక మండలి సభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు మాట్లాడుతూ‌, ప్రతి పేదవాడికీ సంక్షేమ ఫలాలు అందాలనే గాంధీజీ స్ఫూర్తితో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. పామర్రు నియోజకవర్గం ఇన్‌చార్జి ఉప్పులేటి కల్పన కూడా మాట్లాడారు.‌