'జగనన్న ఇచ్చే రాజన్న ఇల్లే నాకు కావాలి'
4 Dec, 2012 08:45 IST
మహబూబ్‌నగర్: : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 47వ రోజు సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు శ్రీమతి షర్మిల వద్ద తమ కష్టాలు చెప్పుకున్నారు.
ఓబులాయిపల్లికి చెందిన వికలాంగుడు జయన్న శ్రీమతి షర్మిలకు తన ఇబ్బందులు చెప్పుకుంటూ.. ‘మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన పెన్షన్‌ను కిరణ్‌కుమార్‌రెడ్డి తీసేసిండు. ఏ పనీ చేయలేనోణ్ణి.. కర్ర లేకుంటే నడవలేనోణ్ణి.. నా పెన్షన్ నాకు ఇప్పించండి’ అని మనసు సంపుకొని అధికారుల కాళ్లు పట్టుకొని గీవులాడినా.. ఒక్కడైనా నాకు సాయం గాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 'షర్మిలక్క పాదయాత్రతోటి ఒత్తావుంది అంటే వైయస్‌ఆర్ జెండా పట్టుకున్నా.. నడుసుకుంటా ఒచ్చినా.. నాకు ఏమీ ఒద్దు. జగనన్న జైలు నుంచి బయటికి వస్తే చాలు.. మా వికలాంగులం ఆయనకు అండగా నిలబడి గెలిపించుకుంటాం.. షర్మిలక్క సెప్పినట్టు రాజన్న సర్కారు ఒత్తది. అప్పుడు ఇదే అధికారులు నా ఇంటికొచ్చి పెన్షన్ ఇయ్యాలే.. ఇందిరమ్మ ఇల్లు పెట్టుకో ఇప్పిత్తామని కాంగ్రెసోల్లు సెప్తున్నారు. వాళ్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా నేను తీసుకోను. జగనన్న ముఖ్యమంత్రి గావాలే.. అన్న ఇచ్చే రాజన్న ఇల్లు తీసుకొని కట్టుకుంటా’ అని జయన్న శపథం చేశారు.
యువ కిరణాలు కావవి పైరవీ కిరణాలు:
‘అక్కా.. నేను మ్యాథ్సులో బీఎస్సీ పూర్తి చేశాను. నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మానేసి ఉద్యోగ ప్రయత్నం మొదలు పెట్టాను. రాజీవ్ యువ కిరణాల కింద ఉద్యోగాలిస్తున్నారంటే ప్రయత్నం చేశా.. నాకు ఏ ఉద్యోగమూ రాలేదు. రికమండేషన్ ఉన్న వాళ్లకు కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు. మా నాన్న వ్యవసాయ కూలీ, నేను వికలాంగుడిని. నాకెవరు రికమండేషన్ చేస్తారు. అర్హులైన ప్రతి వ్యక్తికీ ఉద్యోగమని సీఎం చెప్తున్న మాటలో నిజం లేదు. అవి యువ కిరణాలు కాదు.. పైరవీ కిరణాలు’ అని పి. హన్మంతు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యాంపు పేరుతో మమ్మల్ని వంఛించారు:
కిష్టాపురానికి చెందిన ఎ.శ్రీను మాట్లాడుతూ.. ‘బీఏ పూర్తి చేశాను. ఇది దగా కోరు ప్రభుత్వం. వెనుకటికి ఒక రాజు తన రాజ్యంలోని ప్రజలను భోజనాలు పెడతాను రండి అని పిలిచి, వచ్చిన వారందరినీ వరుసబెట్టి నరికించాడట.. కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన కూడా అలానే ఉందక్కా. ఆయనకు వికలాంగులు అంటే ద్వేషం ఉన్నట్టుంది. ఆయన సదరం క్యాంపులు పెట్టాడు. వికలాంగులకు న్యాయం జరగాలంటే ఈ క్యాంపులకు రావాలే అని చెప్పారు. క్యాంపుకు వెళ్తే ఏవో పరీక్షలు చేసినారు. కొద్ది రోజులకే మాలో చాలా మంది పెన్షన్లు తీసేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మంతుకు రెండు కాళ్లూ పూర్తిగా పనిచేయవు. ఊతకర్ర సహాయం లేనిదే ఒక్క అడుగు కూడా కదలలేడు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం పెన్షన్ తీసేయడమేమిటంటూ శ్రీమతి షర్మిల మండిపడ్డారు.
శ్రీమతి షర్మిల సోమవారం నాటి పాదయాత్రలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలకమండలి సభ్యులు కె.కె. మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఎం.సురేందర్‌రెడ్డి, లీలాధరరావు, కె. రఘునాథరెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, మహమ్మద్‌వాజీద్, జగదీశ్వర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, మహేశ్వరమ్మ, మధుమిత, కందూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.