మహానేత లానే జగన్ లోకూడా ప్రజా సేవ చేయాలనే తపన మెండు

26 Dec, 2018 08:09 IST

వైయస్ఆర్ జిల్లా: వైయస్ కుటుంబం మేలు కాంక్షిస్తూ నిరంతరం తపిస్తూ, దేవడిని ప్రార్థిస్తున్న అందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ లాగనే వైయస్ జగన్ కూడా ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్నారని ఆమె అన్నారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా వైయస్ కుటుంబ సభ్యులు  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ ప్రజలకు వైయస్ కుటుంబ సభ్యుల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహానేత వైయస్ఆర్ చేసిన సేవలను గుర్తకు తెచ్చుకుంటూ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. వైయస్ ఉన్నంతవరకు తన జీవితం ఒక ఎత్తయితే, వైయస్ఆర్ మరణం తరువాతి 9 ఏళ్లు మరొక ఎత్తన్నారు.

ఈ 9ఏళ్లు అనేక కష్టాలతో గడిచిందన్నారు. ఎన్నో కుట్రలు, కేసులు, గొడవలతో ఇబ్బందులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కి తగ్గలేదన్నారు. వైఎస్సార్‌లాగే ప్రజలకు సేవ చేయాలన్న తపన  జగన్‌లో కూడా నిండుగా ఉందన్నారు. 14 నెలలుగా పాదయాత్ర చేస్తున్న జగన్‌ను ప్రతి క్షణం దేవుడు తోడుగా ఉండి కాపాడుకుంటున్నారన్నారు.  వైఎస్‌ కుటుంబం కోసం దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారన్నారని, వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైయస్ కుటుంబీకులు పాల్గొన్నారు. కాగా స్థానిక జీసెస్‌ చారిటీస్‌లోని అనాథ ఆశ్రమంలో గల చర్చిలో వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలమ్మతోపాటు ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి అనాథ పిల్లలచే కేక్‌ కట్‌ చేయించి క్రిస్మస్‌ సంబరాల్లో పాల్గొన్నారు.