అది ప్రభుత్వ హత్యే

22 May, 2018 12:43 IST

పాము కాటుకు గురైన పాప కుటుంబాన్ని ఆదుకోవాలి

రాష్ట్రంలో వైద్యఆరోగ్య శాఖ ఉందా?

ప్రజా ఆరోగ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యమే

ప్రభుత్వ తీరుపై తమ్మినేని సీతారాం మండిపాటు

 శ్రీకాకుళం: శ్రీకాకుళంలో పాముకాటుకు గురై,  సకాలంలో వైద్యం అందక పసిపాప మరణించిన ఉదంతంపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంతో పసిపాప ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వం హత్యే అని, పసిపాప కుటుంబానికి వెంటనే పది లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కొద్ది కాలంగా చూస్తే, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ అనేది  అసలు ఉన్నదా అనిపిస్తోందని, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని ఆరోపించారు. గుంటూరులో ఎలుకులు, చీమలు పసిపిల్లల ప్రాణాలను తీస్తే, శ్రీకాకుళంలో వైద్యులు సకాలంలో వైద్యం అందించక పోవడంతో మరో ప్రాణం కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఇవన్నీ ప్రభుత్వ హత్యేలే అని మండిపడ్డారు.

దురదృష్టవశాత్తూ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి వైద్యులు తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేయడం సమంజసంగా లేదని, కళ్లముందే పసిపిల్ల ప్రాణాలు కోల్పోతుంటే ఆతల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పడే బాధలను వైద్యులు అర్థం చేసుకోవాలన్నారు. వైద్యులు ప్రజల మీద తిరుగుబాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పాప మరణానికి కారణమేమిటో ఆసుపత్రి అధికారులు స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులను వెంటనే శిక్షించాలన్నారు.

 పెట్రో ధరల పెంపు ఉపసంహరించుకోవాలి

 పెట్రో ధరల విషయంలోప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సమీక్షించాలని, పెరుగుతున్న రేట్లను నియంత్రించాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో అధిక ధరలకు ఎందుకు విక్రయిస్తున్నారన్న దానిపై సమాధానం ఇవ్వాలని, అసలు ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని  ఆయన ప్రశ్నించారు. ఈ ధరల నియంత్రణ చేయకపోవడానికి ప్రభుత్వ అసమర్థత, నిర్లక్షమే కారణమని ఆయన మండిపడ్డారు. ప్రలకు భారంగా పరిణిమిస్తున్న ఈ అంశంలో చర్యలు తీసుకోకుంటే ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు.