'సభ'కు అనుమతి నిరాకరణ కాంగ్రెస్ కుట్రే
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఈ నెల 19న నిర్వహించనున్న 'సమైక్య శంఖారావం' సభకు కిరణ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై పార్టీ సీనియర్ నాయకుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో ఆయన మంగళవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తీసుకురావడానికి అడ్డుపడుతున్నది సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డే అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్తులను కాపాడుకోవడానికే కేంద్ర మంత్రులు దృష్టి పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచేందుకు వారు ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదని కొణతాల అన్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
ఈ నెల 19న హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో సమైక్య శంఖారావం బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఆ సభకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దానితో అనుమతి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.