రైల్వే జోన్ సాధించే వ‌ర‌కు పోరాడుదాం

14 Apr, 2016 16:43 IST

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్‌నాథ్ నిర‌వ‌ధిక దీక్ష ప్రారంభం

దీక్ష‌ను ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు

సంఘీభావం తెలిపిన రాజ‌కీయ పార్టీలు, వివిధ ప్ర‌జా సంఘాల నాయ‌కులు 

విశాఖ‌:  విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వేజోన్ సాధించే వ‌ర‌కు అంద‌రం ఐక్యంగా పోరాడుదామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి ప్ర‌త్యేక రైల్వే జోన్‌పై సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో  వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ గురువారం నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేప‌ట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 125వ జ‌యంతి సంద‌ర్భంగా చేప‌ట్టిన ఈ దీక్ష‌ను పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ, అంబ‌టి రాంబాబు ప్రారంభించారు. ఉద‌యం 11 గంట‌ల‌కు డాబా గార్డెన్స్ వ‌ద్ద గ‌ల అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబు, గుడివాడ అమ‌ర్‌నాథ్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పిచారు. అనంత‌రం జీవీఎంసీ ఎదురుగా ఉన్న మ‌హాత్మాగాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ దీక్షా శిబిరంలో అమ‌ర్‌నాథ్ దీక్ష ప్రారంభించారు.  

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అన్న నినాదంతో ఉద్య‌మించి ఉక్కు కార్మాగారాన్ని సాధించుకున్నారని మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. అదే స్ఫూర్తితో రైల్వే జోన్ కోసం తిరిగి ఆ స్థాయిలో నినదించాల్సిన స‌మ‌యం అస‌న్నమైంద‌ని తెలిపారు.  రైల్వేజోన్‌, ఉత్త‌రాంధ్రుల చిర‌కాల కోరిక మాత్రమే కాద‌ని ఆంధ్రుల ఆశాదీప‌మ‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీని రెండేళ్లుగా తొక్కిపెడుతున్న పాల‌కుల దుర్నీతిని ప్ర‌జా పోరాటంతో ఎండ‌గ‌ట్టి, ఐక్యంగా ఉద్య‌మిద్దామ‌ని బొత్సా సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఐదు ద‌శాబ్దాలుగా రైల్వే జోన్ కోసం ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నార‌ని గుర్తు చేశారు. విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వే జోన్ కావాల‌ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌లుమార్లు ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లిసి విన‌తిప‌త్రాలు అంద‌జేసిన విషయాల‌ను బొత్సా సత్యనారాయణ  వివ‌రించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీ అయిన రైల్వేజోన్ అంశాన్ని రెండేళ్లుగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌రుగున ప‌డేశాయ‌ని మండిప‌డ్డారు. స్వార్థం, స్వ‌ప్ర‌యోజ‌నం, రాజ‌కీయ స్వ‌లాభం కోసం కాకుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అమ‌ర్‌నాథ్ దీక్ష చేప‌ట్టార‌న్నారు. ఈ దీక్ష‌కు పార్టీల‌క‌తీతంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని బొత్సా సత్యనారాయణ కోరారు. 

వైఎస్ జ‌గ‌న్ దీక్ష‌ను ప్రోత్స‌హించారు: అంబ‌టి రాంబాబు

విశాఖ రైల్వే జోన్ సాధ‌న‌కు దీక్ష చేప‌డ‌తాన‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్ ముందుకు రావ‌డంతో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భుజం త‌ట్టి ప్రోత్స‌హించార‌ని వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు తెలిపారు. ఇందుకోసం అన్ని పార్టీలు క‌లుపుకొని, అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తుతో ఉద్యమించాల‌ని అధినేత స‌ల‌హా ఇచ్చిన‌ట్లు తెలిపారు. అధికార టీడీపీ, బీజేపీలు ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అంద‌రం బాధ‌ప‌డ్డామ‌ని, కొంద‌రి ప్ర‌యోజ‌నాల కోసం నాడు తెలుగు రాష్ట్రాన్ని రెండుగా చీల్చార‌ని అంబ‌టి రాంబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని నాడు ఆందోళ‌న‌కు దిగితే కొంత న‌ష్టాన్ని పూరించేందుకు పోల‌వ‌రం కేంద్ర‌మే నిర్మిస్తుంద‌ని హామీనిచ్చారు. విశాఖకు ప్ర‌త్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామ‌ని విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్నార‌న్నారు. ఇదే విష‌యంపై 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌మోడీ, చంద్ర‌బాబు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నార‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే విశాఖ‌కు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామ‌ని వాగ్దానం చేసిన పెద్ద మ‌నుషులు రెండేళ్లు గ‌డుస్తున్నా ఎందుకు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని అంబ‌టి రాంబాబు నిల‌దీశారు. ప్ర‌త్యేక జోన్ కోసం వైఎస్సార్‌సీపీ ఆందోళ‌న చేస్తే త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని చెప్ప‌డ‌మే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో మాత్ర‌మ శూన్య‌మేన‌న్నారు. మిత్ర‌ప‌క్ష‌మైన కేంద్రాన్ని ప్ర‌శ్నించే ద‌మ్ము చంద్ర‌బాబుకు లేద‌న్నారు. బాబు గ‌ట్టిగా పోరాడితే ఓటుకు నోటు కేసు, అవినీతి కుంభ‌కోణాలు తిర‌గ‌దోడుతార‌నే భ‌యం చంద్ర‌బాబుకు ఉంద‌ని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర స‌మ‌స్యని, అభివృద్ధి జ‌రుగుతుంద‌న్న భావ‌న‌తో గుడివాడ అమ‌ర్‌నాథ్ దీక్ష చేప‌ట్టార‌న్నారు. ఈ విష‌యాన్ని అధికార పార్టీ నేత‌లు వ‌క్రీక‌రించి కొత్త‌గా విజ‌య‌వాడ రైల్వే జోన్ కోసం ఎందుకు ఉద్య‌మించర‌ని అసంద‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ రైల్వే జోన్ అంశం లేద‌ని, విశాఖ‌కు ప్ర‌త్యేక జోన్ కావాల‌ని నాడు అంద‌రూ డిమాండ్ చేశార‌ని గుర్తు చేశారు. ఆంధ్రుల హ‌క్కు... విశాఖ ఉక్కు... అన్న నినాదంతో ఉద్య‌మించిన విశాఖ వాసులు మ‌రోమారు ప్ర‌త్యేక జోన్ విశాఖ హ‌క్కు అన్న నినాదంతో ఉద్య‌మ‌బాట ప‌ట్టాల‌న్నారు. ఇది ప్రారంభం మాత్ర‌మేన‌ని, అంతం కాద‌న్న విష‌యం తెలుసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి రైల్వేజోన్ ఏర్పాటుకు అంగీక‌రించాల‌ని రాంబాబు డిమాండ్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు తైనాల విజ‌య్‌కుమార్‌, కోలా గురువులు, సీఈసీ స‌భ్యుడు దామా సుబ్బారావు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మ‌న్ స‌త్తి రామ‌కృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్ర‌తినిధి కొయ్యా ప్ర‌సాద‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శులు జాన్‌వేస్లి, హ‌నోక్‌, ర‌విరెడ్డి, శివ‌రామ‌కృష్ణ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.