ఇందిరాసాగర్‌ను విస్మరించిన కిరణ్ ప్రభుత్వం

8 May, 2013 14:59 IST
చంద్రుగొండ (ఖమ్మం జిల్లా): ‘అన్నదాతల కలలు సాకారం చేయాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఇందిరాసాగ‌ర్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ.1800 కోట్లు ఖర్చవుతుంది.‌ వైయస్‌ఆర్ హయాంలోనే 65 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం మిగిలిన 35 శాతం పనులు పూర్తి చేయలేకపోయింది. వందల కోట్లు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరం ఉన్నా ఈ ఏడాది ప్రభుత్వం రూ.90 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందిరాసాగ‌ర్ ద్వారా అశ్వారావుపేట నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని‌ మహానేత వైయస్‌ఆర్ సంకల్పించారు. కానీ, ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదు’ అని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం చంద్రుగొండ ప్రధాన సెంటర్‌లో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.

‘కొద్ది నెలల క్రితం చంద్రుగొండ పెద్దవాగు ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందారు. వారి కుటుంబాలను జగనన్న పరామర్శించారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తరపున ఒక్కొక్క కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ‌నష్టపరిహారం, రెండు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ప్రమాదానికి కారణమైన బ్రిడ్జిని హైలెవల్ బ్రిడ్జిగా మారుస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా? ఇంత జరిగినా ఆ మంత్రికి, ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి బాధిత కుటుంబాల గోస వినిపించదు..’ అని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.

వైయస్‌ఆర్ హయాంలోనే గిరిజ‌న సంక్షేమం :
మహానేత  డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గిరిజనులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా గిరిజనులకు రెండు లక్షల ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించి వైయస్ రికార్డుకెక్కారన్నారు. మరో ఆరు లక్షల ఎకరాలకు గిరిజనులకు హక్కు కల్పించేందుకు ‌ఆయన ప్రణాళిక చేశారని, ఆయన బతికుంటే అది పూర్తయ్యేదన్నారు. కానీ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఒక ఎకరా కూడా గిరిజనులకు పంచలేదన్నారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని కిరణ్‌కుమార్‌రెడ్డి పనిచేస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. పేదలపై భారం పడకూడదని ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా చార్జీలు వైయస్‌ఆర్ పెంచలేదని ఆమె గుర్తుచేశారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తారని, ప్రతి పేదవాని సంక్షేమానికి వెన్నుదన్నుగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తారని, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతిపేద విద్యార్థి చదువులకు అండగా ఉంటారన్నారు.