ఆర్టీసీ కార్మికుల నుంచి అక్రమ వసూళ్లు ఆపాలి
విజయవాడ: ఆసుపత్రి నిర్మాణం పేరుతో ఆర్టీసీ కార్మికుల నుంచి చేపడుతున్న వసూళ్లను ఆపాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని అధోగతి పాలు చేశారని ఆయన విమర్శించారు. సోమవారం విజయవాడలో గౌతంరెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏఎన్‌ఎల్ ఫార్సిల్ చిన్నబాబు కబంధ హస్తాల్లోకి వెళ్లిందన్నారు. రూ.1000 కోట్ల ఆదాయం వచ్చే ఈ ఫార్సిల్ సర్వీసును రూ.900 కోట్లకే టీడీపీ అనుచరులకు అప్పగించడం శోచనీయమన్నారు. ఆగస్టు నెలలో ఈ కాంట్రాక్ట్ గడువు ముగుస్తుండటంతో ఈ ఆఫీస్‌లో ఉన్న దళిత అధికారిని తప్పించి, వారి సామాజిక వర్గానికి చెందిన మరొకరిని తీసుకోవడం బాధాకరమన్నారు. ఆసుపత్రి నిర్మాణం పేరుతో ఎంప్లాయిస్ నుంచి డబ్బులు వసూలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎవరు చెప్పారో తెలియదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఆసుపత్రి నిర్మాణానికి ఒక్కొక్కరి నుంచి వంద రూపాయాలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. దాదాపు రూ.60 లక్షల నిధులు కార్మికుల జోబు నుంచి తీసుకుంటున్నారు. కార్మికులకు సంబంధించిన ఆసుపత్రి విద్యాధరపురంలో కడుతున్నామని ప్రభుత్వం చెబుతుందన్నారు. ఈ ఆసుపత్రిని బాలకృష్ణ వియ్యంకుడికి అప్పగిస్తారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పుడేమో మేం సొంతంగా కడుతున్నామని చెబుతున్నారన్నారు. మీరు సొంతంగా కట్టేటప్పుడు ఏడాదికి రూ.7 కోట్లు కార్మికుల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్ వసూలు చేస్తున్నారని, దానికి అదనంగా మరో వంద రూపాయలు అంటు లాక్కొవడం సరికాదన్నారు. ఆర్‌టీసీలో జరిగే కార్యక్రమాల్లో ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుందన్ని ధ్వజమెత్తారు. బస్సులు కొంటామని చెబుతూ..కొత్త బస్సులు కొనకుండా డబ్బులు ఆడ్మినిస్ట్రేషన్‌కు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 127 డిపోలు, 60 వేల మంది ఉద్యోగులు, 1200 టన్నుల భారంతో 47 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న ఆర్టీసీ బస్సులతో రోజుకు రూ.1300 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. ఇలాంటి సంస్థను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.