హైదరాబాద్ ఒక్కరి సొత్తు కాదు.. అందరిదీ
హైదరాబాద్లో ఏ ప్రాంత ప్రజలూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు హెచ్ఎ రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ అందరిదని, ఈ నగరం నుంచి వెళ్లిపొమ్మనే అర్హత ఏ ఒక్కరికీ లేదన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రణన్నినాదం చేశారు. 'జబ్ సీధీ ఉంగ్లీ సే ఘీ నహీ నికలీతో ఉంగ్లీ టేఢీ కర్నీ పడేగీ' (వేలు తిన్నగా ఉంచితే డబ్బాలోంచి నెయ్యి రాదు.. వేలు వంకరగా పెట్టాల్సిందే) అంటూ సమైక్య రాష్ట్రం కోసం ఏమైనా చేస్తామన్నారు.
సమైక్య శంఖారావం సభలో రెహ్మాన్ మాట్లాడుతూ.. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని చూసి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారని అన్నారు. శ్రీ జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిదేనని ఆయన గుర్తు చేశారు. సమైక్య శంఖారావం కోసం వస్తున్నవందలాది బస్సులను తెలంగాణ ప్రాంతాలలో నిలిపేశారని, పోలీసులు ఆ బస్సులను తక్షణమే అనుమతించాలని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావుకు రెహ్మాన్ విజ్ఞప్తి చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే విభజన: జ్యోతుల నెహ్రూ
మన రాష్ట్రాన్ని రాజకీయ లబ్ది కోసమే విభజిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాలు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి అడ్డగోలుగా నిర్ణయాలు జరుగుతున్నాయి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో ఇరు ప్రాంతాలకు శాశ్వత నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది సమైక్య సభకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గతంలో ఎంతో మంది నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.