![]()
హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012 : నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా వారు హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాధరెడ్డి, గుర్నాథరెడ్డి, గొల్ల బాబురావు, బాలరాజు హోం మంత్రితో భేటి అయ్యారు. తమ పార్టీ వారిని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు హోంమంత్రిని కోరారు.
హోంమంత్రితో భేటి అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతలపై తమ పార్టీ గత నెల 31ననిర్వహించిన బంద్ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్, ఆయన సతీమణి పద్మప్రియలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారన్నారు. శ్రీకాకుళం జిల్లా గార పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.