డమ్మీ రాజప్ప

23 Aug, 2016 11:31 IST
  • రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు
  • మంత్రులకు వైయస్ జగన్ ను విమర్శించే అర్హత లేదు
  • వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ రెడ్డి

నెల్లూరు: ఏపీ ఉప ముఖ్యమంత్రి,  హోం మంత్రి చిన రాజప్పపై వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆయన  డమ్మి హోంమంత్రి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అడ్డుపడుతున్నారని టీడీపీ మంత్రులు విమర్శించడాన్ని ఆయన ఖండించారు.   నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని వేగూరు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ..   రాష్ట్రంలో ఒక డమ్మి హోం మంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు. చినరాజప్పకు మొక్కుబడిగా ఉపముఖ్యమంత్రి పోస్టు కట్టబెట్టారని, పోర్టు పోలియోకు తనకు ఈ పదవి దేనికీ ఉపయోగం లేదన్నారు. డీజీపీ స్థానం నుంచి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వరకు ఆయన్ను చూసి సెల్యూట్‌ చేసే పరిస్థితి లేదన్నారు.  

చినరాజప్పకు  అధికారం  ఇవ్వకుండా లా అండ్‌ ఆర్డరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర పెట్టుకోవడం శోచనీయమన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న హోం మంత్రి చినరాజప్పకు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. ముందు  హోం డిపార్ట్‌మెంటులో నీకు కనీస విలువ ఇచ్చే పరిస్థితి తెచ్చుకో అని రాజప్పకు హితవు పలికారు.  

మంత్రుల మాటలు హాస్యాస్పదం..
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై మంత్రుల విమర్శలు హాస్యాస్పదమని  ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.  ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి  ఒక నిర్థిష్టమైన నిబద్దత కలిగిన నాయకుడిగా పోరాడుతుంది వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమేనని తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలంటే, చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేక హోదా పదేళ్లు కాదు పదిహేను ఏళ్లు కావాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబునాయుడే ప్రధాన కారణమన్నారు. రాష్ట్రం విభజిస్తే తమకు ఏలాంటి అభ్యంతరం లేదని రాష్ట్రపతికి లేఖ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. వైయస్‌ జగన్‌ గత గోదావరి పుష్కరాలు, ప్రస్తుత కృష్ణ పుష్కరాల్లో స్నానం చేసి..రాష్ట్రాభికోసం పూజలు చేశారని వెల్లడించారు.∙చంద్రబాబు లాగా కుటిల రాజకీయాలతో స్నానం చేయలేదని విమర్శించారు.  సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా నాయకులు నిరంజన్‌బాబురెడ్డి, రాధాకృష్ణారెడ్డి , మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పద్మ, చంద్ర, నందగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.