తప్పుడు నిర్ణయం చేస్తే చరిత్ర క్షమించదు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013పై గురువారం నాడు అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పోలీసులు ధర్నాను భగ్నం చేసి, పార్టీ కార్యాలయానికి తరలించిన అనంతరం లోటస్‌పాండ్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే చరిత్ర క్షమించదని ఆమె హెచ్చరించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తాము చేస్తున్న ధర్నాను భగ్నం చేయడంపై శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఇప్పటికి మూడుసార్లు అరెస్టు చేసి తీసుకువచ్చారన్నారు. విభజన ప్రక్రియకు కేంద్రం పూనుకున్నప్పటి నుంచీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అనేక రకాలుగా పోరాటం చేస్తోందన్నారు. బుధవారం నాడు అసెంబ్లీలో తాము ధర్నాకు దిగింది కూడా సమైక్య తీర్మానం చేయాలని, విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలనేనన్నారు. అందుకే సభలో తీర్మానం పెట్టి రాష్ట్రపతికి పంపాలని విజ్ఞప్తి చేశారు.
తమ విజ్ఞప్తిపై బహుశా స్పీకర్ గురువారం స్పందించవచ్చన్న ఆశాభావాన్ని శ్రీమతి విజయమ్మ వ్యక్తం చేశారు. స్పీకర్ నుంచి స్పష్టత రాకపోవడం వల్లే తాము సభలోనే ధర్నా చేశామని తెలిపారు.