ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా?
21 Oct, 2017 15:27 IST
విష జ్వరాలతో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు
మొద్దునిద్రపోతున్న టీడీపీ సర్కార్
పరిపాలన గాలికొదిలి సీఎం విదేశీ పర్యటనలు
రెండు వారాల్లో 82 మంది మృతి
వైయస్‌ఆర్ పాలనను ఉదాహరణగా తీసుకొని పాలించు
ప్రకాశంలో చెట్ల కింద రోగులు వైద్య సేవలు
ఇదేనా మీ పరిపాలనా విధానం చంద్రబాబూ?
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలి
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్
హైదరాబాద్: విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిచాల్సిన సర్కార్ మొద్దు పోతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ... సీఎం డ్యాష్‌బోర్డు ప్రకారం డెంగీ జ్వరాల బారినపడిన వారు గత వారంలో ప్రకాశం జిల్లాలో 50 మంది ఉంటే ఈ వారం 49 మంది, గుంటూరులో గత వారం 44 ఉంటే ఈ వారం 56 మంది, విశాఖలో గత వారం 72 మంది ఈ వారంలో 59 మంది ఉన్నారన్నారు. రాష్ట్రం మొత్తం మీద గత వారం 272 మంది ఉంటే ఈ వారంలో ఆ సంఖ్య రెట్టింపు అయి 305కు చేరిందన్నారు. అంటే రాష్ట్రంలో ఏ మేరకు వైద్య సేవలు అందుతున్నాయో, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షిస్తుందో ఆలోచించుకోవాలన్నారు. కనీసం జ్వరాన్ని కూడా తగ్గించలేని దుర్మార్గపు ప్రభుత్వ పాలిస్తుందన్నారు.
గిరిజనులకు దోమతెరలు పంపిణీ చేసే సమయం లేదా?
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 109 మందికి మలేరియా, 492 మందికి డెంగీ, 22,180 మంది డయేరియా, 14 వందల మందికి టైఫైడ్ ఇలా ఒక్కో జిల్లాలో లక్షల మందికిపైగా విష జ్వరాల బారినపడ్డారని బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వారాల్లో 82 మంది ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా మణ్యం ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ 22 లక్షల దోమ తెరలు పంపిస్తే వాటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం దోమ తెరలను పంపించిందని గొప్పలు చెప్పుకోవడానికి టైం ఉంది కానీ వాటిని గిరిజనులకు పంపిణీ చేసేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు పరిరక్షణ ప్రకటనలకే పరిమితం
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనను ఉదాహరణగా తీసుకొని చంద్రబాబు పరిపాలన చేయాలని బత్తుల సూచించారు. వైయస్‌ఆర్ హయాంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 108, 104, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు చేపట్టి ఆరోగ్యపరిరక్షణకు పాటుపడ్డారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు పరిరక్షణ ప్రకటనలకే పరిమితమైందన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన జరగకుండా వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మరుగుదొడ్లకు విడుదల చేసిన నిధులు టీడీపీ నేతలు జేబుల్లోకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దోమల మీద యుద్ధాన్ని ప్రకటిస్తే విష జ్వరాలు ఎక్కువయ్యాయన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వారికి వైద్యం అందక డయేరియా వ్యాధిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు ప్రకాశం జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారన్నారు. ప్రకాశం జిల్లాలో సరైన సదుపాయాలు లేక చెట్ల కింద రోగులకు గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వంతో ప్రజలు మేలు జరుగుతందా?
ప్రజలకు సరైన వైద్య సేవలు అందించలేని ప్రభుత్వాల వల్ల ప్రజలు మేలు జరుగుతుందా అని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు వెంటనే వైద్య వసతులు మెరుగుపర్చాలి. ప్రభుత్వం ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాలని వైయస్‌ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించిన దాఖలాలు అనేకం ఉన్నాయన్నారు. మూత్రపిండాల వ్యాధిబారిన పడి వికలాంగులు అయిన వారిని పరామర్శించేందుకు వచ్చారని గుర్తు చేశారు. ప్రతిపక్షనేత హెచ్చరిస్తున్న ప్రభుత్వానికి దున్నపోతుపై వర్షండినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి అన్ని ప్రాంతాల్లో వైద్య వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.