నిధులున్నా..! ఉపాధి సున్నా..?

7 Feb, 2017 18:28 IST
ప్రశ్నార్థకంగా రూ.15లక్షలు
పనులివ్వాలంటున్న కూలీలు
బెల్లుపటియా(మందస): మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యానికి అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిపి తూట్లు పొడుస్తున్నారు. పేదలకు ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులున్నప్పటికీ, లక్ష్యాన్ని నెరవేర్చలే కపోతోంది. తెలుగుదేశం కార్యకర్తలు పనులకు అడ్డుపడుతూ, మంజూరైన నిధులకు అడ్డుకట్ట వేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో అధికారులు వారి అడుగులకు మడుగులొత్తుతూ, రోజుకో నిబంధనలు పెడుతున్నారు. సుమారు 500 మంది కూలీలు ఇటు పనులు లేక అటు ఉపాధిలేక ఉన్నారు. మందస మండలలలోని బెల్లుపటియాలో 26 గ్రూపులతో 512 మంది ఉపాధి హామీ కూలీలున్నారు. పంచాయతీకి సంబంధించి ఉన్న తెప్పచెరువు మరమ్మతులకు ఉపాధి పథకం కింద 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వ్యవసాయం పనులు పూర్తవ్వడంతో ఉపాధి హామీ పనులు చేయడానికి కూలీలు సిద్ధపడ్డారు. కానీ, తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుపడడం ప్రారంభించారు. నీరు–చెట్టు పథకం కింద ప్రతిపాదనలు పెడుతున్నామని, ఉపాధి హామీ పనులు చేయవద్దని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనులకు అడ్డుపడ్డారు. ఇప్పటికే రూ.15లక్షలు మంజూరయ్యాయని చెప్పినా, వినిపించుకోకుండా పనులు నిలిపివేయడానికి  పైరవీలు ప్రారంభించారు. దీంతో ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది పనులు ప్రారంభించాలంటే.. ఇవి కావాలి... అవి కావాలంటూ వేధిస్తున్నారు. జన్మభూమి కమిటీ తీర్మానం కావాలని, సర్పంచ్‌ సంతకం కావాలని.. ఎంపిటిసి ఒప్పుకోవాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలే జన్మభూమి సభ్యులుగా ఉండగా, వారే పనులు అడ్డుకుంటున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం వారి సంతకాలే కావాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఉపాధి హామీ పనులు పలు చోట్ల ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బెల్లుపటియా తెప్ప చెరువు మరమ్మతులకు నిధులున్నా, ఉపాధి పనులను అధికారులు చేయించడానికి ముందుకు రావడంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పరిధిలో పనులు చేయాలంటే ఎక్కడా పని చేయడానికి అవకాశంలేదు. జరాచెరువు, దుబ్లి చెరువు, ఊరచెరువులు నీటితో నిండి ఉన్నాయి. అధికారులు స్పందించి, పనులు కల్పించే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మంజూరైన పనులకు నీరు–చెట్టు అన్యాయం: అగ్గున్న సూర్యారావు, మాజీ సర్పంచ్‌
ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే నిధులున్నాయి. కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీరు–చెట్టు కింద పనులు పెడతామని పనులు చేయవద్దంటున్నారు. ఇది అన్యాయం

నిధులున్నాయి.. పనులు చేయలేకపోతున్నాం: రఘు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌
బెల్లుపటియా పంచాయతీకి సంబంధించి ఉపాధి పనులకు నిధులున్నాయి. కానీ, పనులు చేయవద్దని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుపడుతున్నారు.