హోదా వచ్చేవరకు పోరాటం

23 Mar, 2017 15:58 IST
ఢిల్లీః ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేయడం తగదని వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలపడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం గత మూడేళ్లుగా చట్టసభల్లో, బయట వైయస్సార్సీపీ పోరాడుతూ వస్తోందని, హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదని వైవీ తెలిపారు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేకహోదాను పోరాడి సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయని మండిపడ్డారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఎందుకు ఇస్తున్నారో వివరణ ఇవ్వాలని నీతిఆయోగ్ కు లెటర్ రాసినా ఇంతవరకు రిప్లై లేదని అన్నారు. దీనిపై పార్లమెంట్ లో రైజ్ చేస్తామన్నారు. దీనిలో భాగంగానే సెక్షన్ 377 కింద నోటీసులివ్వడంజరిగిందని చెప్పారు. 

ఏపీలో కిడ్నీ బాధితుల పరిస్థితిని ప్రధానికి వివరించిన దరిమిలా ఇవాళ ఐసీఎమ్మార్ డైరెక్టర్ సౌమ్యాస్వామినాథన్ తనను కలిశారని వైవీ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారు.  పరిస్థితి ఏవిధంగా ఉందన్నది ఆమెకు క్షుణ్ణంగా తెలిపామన్నారు.  ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో  రెండేళ్లలో 426 మంది  చనిపోవడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నందున టీంను పంపించాలని కోరడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మొబైల్ మెడికల్ టీంలను ఏర్పాటు చేసి చెక్ చేసేందుకు  ఢిల్లీనుంచి స్పెషల్ టీంను పంపించాలని చెప్పామన్నారు.  28వ తేదీన ప్రత్యేక టీఎం వస్తుందని, ప్రధానమంత్రి స్పెషల్ గ్రాంట్ కింద కిడ్నీ సమస్యలపై డిస్కస్ చేసి చర్యలు తీసుకుంటామని వారు చెప్పారని వైవీ స్పష్టం చేశారు.