ఈ దాహం తీరనిది..!
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ దాహానికి అంతే లేకుండా పోతోంది. చట్టాలకు, ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడిచి అయినా సరే భూముల్ని లాక్కొనే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఎలాగైనా రాజధాని ప్రాంతంలో భూముల్ని ఆక్రమించేందుకు గల అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి
ఇప్పటి పరిస్థితిని చూస్తే గతంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టమే అమల్లో ఉంది. ప్రజల నుంచి భూములు లాక్కొనేటప్పుడు అనుసరించాల్సిన విధానాల్ని ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా బహుళ పంటలు పండే భూముల్ని తీసుకోరాదని ఈ చట్టంలో ఉంది. భూముల్ని తీసుకొంటే సామాజిక అంశాల్ని పరిగణన లోకి తీసుకోవాలి. పైగా రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. వీటిని తిరగతోడుతూ ఎన్డీయే ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ను ఇచ్చింది కానీ, దీన్ని చట్ట రూపంలోకి తీసుకొని రాలేకపోయింది. దీని పై వెనక్కి వెళ్లే ఆలోచనలోకి కేంద్రం వచ్చేసింది.
చంద్రబాబు అవసరాలే ముఖ్యం
విదేశీ పర్యటనలు, యాత్రలు అదే పనిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు విదేశీ కంపెనీలకు బోలెడు వాగ్దానాలు చేసి వచ్చారు. 10 లక్షల ఎకరాలతో భూమి బ్యాంక్ ను ఏర్పాటు చేసి, ఈ భూముల్ని అడ్డగోలుగా దోచిపెడతానని చెప్పకనే చెప్పారు. రాజధాని విషయంలో అయితే సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరిపోయాయి. అక్కడ రైతుల్నిభయపెట్టి, బెదిరించి భూముల్ని లాక్కొని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్దం చేసింది. ఇదంతా ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా చేసుకొంటూ వచ్చారు. కానీ, ఇంతలో ఆర్డినెన్స్ ఆగిపోవటంతో చంద్రబాబు భూ దాహానికి అడ్డు పడుతోంది.
సవరణ మార్గంలో ప్రభుత్వం
కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ చట్ట రూపం దాల్చే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే ఆర్డినెన్స్ రూపంలో ముందుకు వెళితే న్యాయపరమైన చిక్కులు తప్పేట్లుగా లేవు. అటువంటప్పుడు ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో భూ సేకరణ చట్టానికి సవరణ తెద్దామనే యోచన ముందుకు వచ్చింది. అనుకొన్నదే తడవుగా న్యాయశాఖను సంప్రదించారు. ఈ యోచన మేరకు అసెంబ్లీలో ఎటూ మెజార్టీ ఉంది కాబట్టి బలవంతంగా దీన్ని నెగ్గించుకొని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ఆమోదం తెచ్చుకొందామన్న యోచన లో ఉన్నారు. అడ్డగోలుగా రైతుల నుంచి భూములు లాక్కొనేందుకు ఉన్న నన్ని మార్గాల్ని ఉపయోగించుకొంటున్నారు.