ఈ బడ్జెట్‌లోనైనా గుంతకల్లు డివిజన్‌కు న్యాయం చేయాలి
ఉరవకొండ: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కనీసం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్‌లో నైనా న్యాయం చేసి పెండింగ్ పనులకు సరిపడ నిధులు కేటాయించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 4వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్ధం అవుతుందని, ఈసారి గుంతకల్లు డివిజన్ కు న్యాయం జరుగుతుందని జిల్లా ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇందులో గుంతకల్లు– గుంటూరు డబ్లింగ్ రూ.1400 కోట్లు నిధులు కేటాయించాల్సి వుందని, ఈసారైన ఆ నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే బాగేపల్లి నుండి కదిరి కు కొత్తలైన్‌కు మంజురు చేయాలని, ధర్మవరం–పాకాల వరుకు డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించాలని కోరారు.