జగన్‌బాబు చేసిన తప్పేంటి?

22 Jun, 2013 15:45 IST
విజయవాడ, 22 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏ తప్పు చేశారని సిబిఐకి, ప్రభుత్వానికి అప్రూవల్‌గా మారాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. తన కొడుకు ఏ తప్పు చేశారని దేశ బహిష్కారం చేయాలంటారని నిలదీశారు. శ్రీ జగన్‌పై ఉన్నవి కేవలం అభియోగాలు మాత్రమే అని ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యుల్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్న వారిని దేవుడు చూస్తున్నాడని, త్వరలోనే బుద్ధి చెబుతాడని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబానికి ఆత్మీయులని, అందుకే తమ విషయాలు చెప్పుకోవాలనుకున్నానని అన్నారు. విజయవాడలో శనివారం జరిగిన కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పంచాయతీరాజ్‌ ప్రాంతీయ సదస్సులో శ్రీమతి విజయమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తను ఉద్దేశించి ప్రసంగించారు.

తమ కుటుంబం గురించి కొన్ని విషయాలు పార్టీ శ్రేణులతో పంచుకోవాలనుకుంటున్నట్లు శ్రీమతి విజయమ్మ అన్నారు. జగన్‌బాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె వివరణ ఇచ్చారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెబుతూ ఉండేవారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. తన కుటుంబం, బైబిలు చివరికి తన బొట్టు గురించి కూడా మాట్లాడడం సిగ్గుచేటు అని శ్రీమతి విజయమ్మఆవేదన వ్యక్తంచేశారు. ఇదంతా దిగజారుడు రాజకీయానకి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేంద్రం చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని దాని మాజీ డైరెక్టర్‌ జోగిందర్‌ సింగ్‌ చెప్పిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. పంజరంలో సిబిఐ అని ప్రస్తుత డైరెక్టర్‌ రంజిత్ సిన్హా సుప్రీంకోర్టులో ఒప్పుకున్న వైనాన్ని ప్రస్తావించారు. ప్రధాని కార్యాలయంలో న్యాయ శాఖ మంత్రి, అధికారులు కూర్చుని కోల్‌గేట్‌ కుంభకోణంపై సిబిఐ చేసిన దర్యాప్తు నివేదికను పేరాలకు పేరాలే మార్చేసినట్లు సుప్రీంకోర్టుకు చెప్పారన్నారు. దీన్ని చూస్తే సిబిఐ ఎంత నిబద్ధతతో పనిచేస్తోందో అందరూ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యక్తిగతంగా ఎదిగే వారిని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడే వారందరిపైన కేంద్ర ప్రభుత్వం సిబిఐని ఉసిగొల్పి ఇబ్బందులు పెడుతోందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు.

ఇక జగన్‌బాబు విషయానికి వస్తే.. 15 నెలల పాటు ఎంపిగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వైనాన్ని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. కాంగ్రెస్‌లో ఉన్నంతకాలమూ జగన్‌బాబుపై ఒక్క కేసు కూడా లేదన్నారు. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన వారం రోజుల లోపలే జగన్‌బాబుకు ఐటి నోటీసులు పంపిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ టిడిపిలు కుమ్మక్కై మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన 26 జి.ఓలు సరైనవా కావా అంటూ కోర్టుకు వెళ్ళాయని అన్నారు. ఆ జిఓలు సక్రమమా? కాదా? అని కోర్టు అడిగితే 8 నెలలైనా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. ఈ కేసులో 52వ ముద్దాయిగా ఉన్న జగన్‌బాబును సిబిఐ మొదటి ముద్దాయిగా చేసి విచారణ చేయడమేమిటని ఆమె నిలదీశారు. 1 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఉన్నారని అన్నారు. వారినెవరినీ విచారణ చేయకుండా కేవలం జగన్‌బాబు ఒక్కరిపైనే సిబిఐ దర్యాప్తు చేస్తున్నదన్నారు.

సిఆర్‌పిసి నిబంధనల ప్రకారం ఒక ఎఫ్‌ఐఆర్‌ కు ఒకే చార్జిషీట్‌ వేయాల్సి ఉండగా ఇన్ని చార్జిషీట్లు ఎందుకు వేస్తున్నట్లని సిబిఐని శ్రీమతి విజయమ్మ సూటిగా నిలదీశారు. దర్యాప్తు చేయక ముందే అనేక చార్జిషీట్లు వేస్తామంటూ సిబిఐ అధికారి ఏ విధంగా చెబుతారని ఆమె ప్రశ్నించారు. విచారణ లేకుండా పలు చార్జిషీట్లు ఏ విధంగా వేస్తారని విమర్శించారు. చార్జీషీట్‌ వేసే ముందుగా జగన్‌బాబును ప్రశ్నించాల్సిన కనీస ధర్మాన్ని కూడా సిబిఐ విడిచిపెట్టిందని ఆమె నిప్పులు చెరిగారు. ఓదార్పు యాత్ర చేస్తూ జగన్‌బాబు పదకొండు నెలలుగా రాష్ట్ర ప్రజల మధ్యనే ఉన్నారని, అయినప్పటికీ సిబిఐ తన విద్యుక్త ధర్మాన్ని వదిలేసిందన్నారు. కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలనైనా సిబిఐ పాటించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. విచారణ పూర్తిచేసి ఇంకా ఒక్క చార్జిషీటే వేయాలని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశించి నాలుగు నెలలు సమయం ఇచ్చిందని, అయితే ఆ సమయంలోనే విచారణ పూర్తిచేయాలని లేదని, మళ్ళీ మరింత సమయం కావాలని కోర్టును అడుగుతాం అని సిబిఐ న్యాయవాది ఆ వెనువెంటనే కోర్టు బయటికి వచ్చి చెప్పడాన్ని శ్రీమతి విజయమ్మ తప్పుపట్టారు.

సమన్లు ఇస్తామని చెప్పి జగన్‌బాబును సిబిఐ అరెస్టు చేసిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ తప్పుపట్టారు. ఉప ఎన్నికల ప్రచారం పూర్తయిన తరువాత తాను లొంగిపోతానని జగన్‌బాబు కోర్టుకు వినయపూర్వకంగా అభ్యర్థించిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. సమన్లు ఇచ్చేందుకు పిలిచిన సిబిఐ ఎలా అరెస్టు చేస్తుందని సిబిఐ కోర్టు చెప్పిన కొన్ని గంటల్లోనే సిబిఐ ఆయనను అరెస్టు చేసిందని చెప్పారు. చార్జిషీట్ల పేరు చెప్పి జగన్‌బాబుకు బెయిల్‌ రానివ్వకుండా సిబిఐ అన్యాయంగా అడ్డుపడుతోందని దుయ్యబట్టారు. జగన్‌బాబును బయటికి రానివ్వకుండా ఉంచాలని సిబిఐ, కాంగ్రెస్‌, టిడిపి పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పలుకుబడి, సాక్షులను ప్రభావితం చేయగల అవకాశం ఉన్న మంత్రులు బయటే ఉండగా, అలాంటి అవకాశమేదీ లేని జగన్‌బాబును మాత్రం ఎందుకు నిర్బంధించారని ఆమె నిలదీశారు. అంతకు ముందు బయట ఉన్నప్పుడు జగన్‌బాబు ఏ ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశారా? లేదా అందుకు ప్రయత్నించారా అని నిరూపించగలరా? అని శ్రీమతి విజయమ్మ సిబిఐని ప్రశ్నించారు.

సాక్షిలో పెట్టుబడులపై ఆరోపణలు చేస్తున్న వారి వ్యాఖ్యలను శ్రీమతి విజయమ్మ తీవ్రంగా తిప్పికొట్టారు. ఆ పెట్టుబడుల్లో ఒక్క రూపాయి కూడా జగన్‌బాబు జేబులోకి రాలేదని శ్రీమతి విజయమ్మ వివరణ ఇచ్చారు. సాక్షి నుంచి జగన్‌బాబు ఒక్క పైసా కూడా జీతంగా తీసుకోలేదన్నారు. తన కోడలు, శ్రీ జగన్‌ సతీమణి శ్రీమతి భారతమ్మ కూడా ఒక్క పైసా తీసుకోవడంలేదన్నారు. సాక్షిలో వాటా ఒక్కొక్కటి రూ. 325కు విక్రయించడం తప్పట! వంద రూపాయల షేరును ఈనాడు రూ. 5,28,635కు అమ్మితే తప్పులేదట అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. ఈనాడులో రూ.2,600 కోట్లు పెట్టుబడులు పెడితే ఒక్క పైసా కూడా డివిడెండ్‌ ఇచ్చిన పాపానపోలేదన్నారు. అయినప్పటికీ ఈనాడు వ్యవహారాన్ని పట్టించుకోకుండా కేవలం సాక్షి మీద మాత్రమే సిబిఐ దాడులు చేయడమేమిటని ఆమె నిలదీశారు. సాక్షి ఆస్తులను అటాచ్‌ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్‌బాబును పెట్టిన జైలు గదిలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా సిసి కెమెరాలు పెట్టారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. మరో ఇతర నిందితుల విషయంలోనూ అనుసరించని విధంగా సిబిఐ కేవలం జగన్‌బాబు ఇంటిలో 27 బృందాలు సోదాలు చేయడాన్ని ఆమె ప్రస్తావించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం తెలియదని శ్రీమతి విజయమ్మ అన్నారు. తనకు ఉన్నది నలుగురికీ పంచడం మాత్రమే తెలుసన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. నాయకత్వ లక్షణాలను ప్రదర్శించుకోవడానికి పార్టీ కార్యకర్తలకు స్థానిక ఎన్నికలే సరైన వేదిక అని శ్రీమతి విజయమ్మ సూచించారు. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని దిశానిర్దేశం చేశారు. సమస్యల విషయంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజాపక్షం వహించాలని సూచించారు.

ఈ సదస్సుకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నింటి అమలుకు కృషి చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సదస్సుకు హాజరైన అందరి చేత ప్రమాణం చేయించారు.