ధర్మవరంలో జన ప్రభంజనం
ధర్మవరం 26 అక్టోబర్ 2012 : షర్మిల తన పాదయాత్రలో భాగంగా తొమ్మిదవ రోజు శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరం చేరుకున్నప్పుడు అపూర్వ జనస్వాగతం లభించింది. షర్మిల మరో ప్రజాప్రస్థానానికి ధర్మవరం బ్రహ్మరథం పట్టింది. వైయస్ విజయమ్మ, మైసూరా రెడ్డి తదితర నేతలతో కలిసి, వేలాదిగా జనం తరలిరాగా షర్మిల ధర్మవరం పట్టణంలో వీధుల గుండా అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు. పురవీధులలో ఎటు చూసినా జనమే.
ఇంతకు మున్నెప్పుడూ ఈ స్థాయిలో ఇంత భారీ సంఖ్యలో జనం ఏ నేత సభకూ రాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇళ్లపైన సైతం షర్మిల యాత్రను చూడడానికి జనం క్రిక్కిరిసిపోయారు. ఇసుక వేస్తే రాలనంతగా జనం రావడంతో వైయస్ఆర్ సీపీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. నిజానికి మధ్యాహ్నం వేళకే బహిరంగసభాస్థలికి రావలసిన షర్మిల, జనవాహిని నడుమ యాత్ర నెమ్మదిగా సాగటం వలన సాయంత్రం 5.30 గంటలకు గాని చేరలేకపోయారు. ధర్మవరంలో షర్మిల చేనేత కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు.