చంద్రబాబు పేరు చెబితే అందుకే హడల్

12 Nov, 2015 15:58 IST

ఖర్చులు తలచుకొంటూ వణుకుతున్న మండలాధికారులు

విజయవాడ: ప్రచారం కోసం పరితపించే ముఖ్యమంత్రి చంద్రబాబు..దీని కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని బలి పెడుతున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు అవుతుండటంతో మండల స్థాయి అధికారులు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాజధాని చుట్టుపక్కల ఉండే 3,4 జిల్లాల్లోనూ మండలాధికారులు బాబు అంటే హడలిపోతున్నారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అయిన దానికి, కాని దానికి ప్రచారాన్ని మోతెక్కిస్తున్నారు. చెడ్డ పేరుమీద పడుతుందని అనుమానం వచ్చినప్పుడల్లా ప్రచారపు స్టంట్ చేసి బయట పడటం చంద్రబాబుకు అలవాటైన విద్య. ఈ గిమ్మిక్కుల కోసం జనాల్ని తరలించేందుకు మండల స్థాయి అధికారులు తల పట్టుకొంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకు మహా సంకల్ప యాత్ర అంటూ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి పొలోమంటూ జనాన్ని తరలించాలని ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్ బాస్ ల నుంచి వచ్చిన ఆదేశాల్ని జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అదికారుల మీద రుద్దేశారు. దీనికి ప్రోటోకాల్ విభాగంనుంచి నిధులు వస్తాయని భరోసా ఇచ్చారు. దీంతో జనాల్ని పెద్ద ఎత్తున తరలించారు. రోజులు గడిచిపోయాయి, జనం వెళ్లి వచ్చారు కానీ నిధులు విడుదల కాలేదు.

ఈలోగా ఓటుకి కోట్లు కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగాబుక్కయిపోయారు. పట్టపగలు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ దొరికిపోయారు. ఆడియో, వీడియో టేపులు బహిరంగంగా టీవీ ఛానెళ్లలో విపరీతంగా ప్రచారం అయిపోవటంతో పరువు దక్కించుకొనేందుకు విజయవాడ బెంజి సర్కిల్ లో నవ నిర్మాణ దీక్ష కు పిలుపు ఇచ్చారు. మళ్లీ హైదరాబాద్ బాస్ ల ఆదేశాల్ని పాటిస్తూ కలెక్టర్లు ఆర్డర్లు ఇవ్వటంతో మండల అధికారులు జనాన్ని తరలించారు. వారం రోజుల క్రితం అవినీతి కి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. అవినీతి ని సహించబోమంటూ బెంజి సర్కిల్ లో నాటకాల దీక్ష చేస్తే దాన్ని చూసేందుకు అన్ని మండలాల నుంచి జనాన్ని తరలించారు. దీనికి కూడా ప్రోటోకాల్ విభాగం నిధులు అంటూ కబుర్లు చెప్పారు కానీ, నిధులు మాత్రం రాలేదు. దీంతో అధికారులకు చేతి చమురు వదిలింది.

ఈ లోగా గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు షార్ట్ ఫిల్మ్ సినిమా పిచ్చికి దాదాపు 30 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మచ్చను వదిలించుకొనేందుకు గోదావరి.క్రిష్ణా నదుల పవిత్రసంగమం అంటూ కొత్త నాటకానికి తెర దీశారు. పట్టిసీమ పనులు ఏమాత్రం పూర్తి కాకుండానే చెంబుడు నీళ్లను తీసుకొని వచ్చి క్రిష్నా నదిలో కలిపేసి నదుల అనుసంధానం అంటూ ఎల్లోమీడియాలో కథనాలు రాయించుకొన్నారు. దీన్ని చూసేందుకు జనాన్ని పిలిపించారు. మళ్లీ మండలాధికారులు తలో కొంత డబ్బులు వేసుకొని జనాన్ని తరలించారు. ఈ సారి భోజనాల ఖర్చు అంతా డ్వాక్రా సంఘాల మీద రుద్దారు. పులిహోర ప్యాకేట్లు తయారుచేయించి పంపించాలని డ్వాక్రా సంఘాల మహిళల్ని బెదిరించి ఆహారపు పొట్లాలు సిద్దం చేయించి పంపించారు.

తర్వాత అమరావతి శంకుస్థాపన కు జనాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు చెమటలు కక్కారు. ఎటూ ప్రోటోకాల్ నిధులు రావని తెలుసు. కానీ టార్గెట్ ప్రకారం జనాన్ని పంపించక పోతే ఉన్నతాధికారుల నుంచి మాట వస్తుందన్న బెంగతో రక రకాల గిమ్మిక్కులు చేసి జనాన్ని పంపించారు. ఈ సారి వాహనాల్ని ప్రభుత్వ పెద్దలే ఏర్పాటు చేయటంతో కొంత లో కొంత ఊరట లబించింది.

మొత్తం మీద చంద్రబాబు ప్రచారపు ఆర్భాటానికి తాము బలి కావలసి వస్తోందని మండలాధికారులు వాపోతున్నారు. దీంతో ఈ డబ్బును వసూలు చేసుకొనేందుకు మండల కార్యాలయాలకు వచ్చే ప్రజల్ని ఇబ్బంది పెట్టి మరీ దోచేసుకొంటున్నారు.