దళితులకు ప్రభుత్వం దగా

10 Jun, 2013 11:47 IST
హైదరాబాద్ :

స్థానిక సంస్థలకు రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీనవర్గాలు, మహిళలకు అన్యాయం చేసిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ‌నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం విజయమ్మ అధ్యక్షతన ఆమె క్యాంపు కార్యాలయంలో తెలంగాణ, రాయలసీమ జిల్లాల సమన్వయకర్తలు, పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు, ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్‌లు, 10,942 జెడ్పీటీసీలు, 21,843 గ్రామ పంచాయతీలు, 16,168 ఎంపీటీసీ, 182 మున్సిపాలిటీ, 19 మున్సిపల్ కార్పొరేష‌న్ పదవులు ఉన్నాయని, వాటన్నింటికీ కావాలనే సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని ఆమె ‌ఆరోపించారు.

బడుగు బలహీనవర్గాలు, మహిళలకు ఈ సంస్థల్లో చాలా పదవులు రిజర్వయి ఉన్నాయని, ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆ వర్గాల వారందరినీ స్థానిక అధికారానికి దూరం చేసినట్లయిందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిపైనే నిర్మాణ‌ం పనులు కేటాయించి అధికారపక్షం కార్యకర్తల జేబులు నింపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారికి బదులు ప్రజల నుంచి ఎన్నుకున్న వారే ప్రతినిధిగా ఉంటే బాధ్యతాయుతంగా ప్రజా సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

నిధుల కోసమే ఇప్పుడు ఎన్నికలు :
ఇపుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదని, కోర్టుల ఆదేశాలు, కేంద్రం నుంచి రావాల్సిన రూ.4 వేల కోట్ల నిధులు ఆగిపోవడం వంటి కారణాల వల్లే ఎన్నికలకు ముందుకు వచ్చిందని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఎన్నికలు జరగనందువల్ల స్థానిక సంస్థలకు బదలీ చేయాల్సిన 29 అధికారాలను కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు కూడా స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వకుండా నీరుగార్చే యత్నం చేశారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషీగా వ్యవహరించొద్దని ఆమె ఉద్బోధించారు. అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లు పట్టుదలతో అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కూడా ఆమె సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపి రెండూ కలిసి అవగాహనతో పనిచేసే అవకాశం ఉన్నందున వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌నాయకులు గట్టిగా పోరాడాల్సి ఉంటుందన్నారు. పల్లెల్లో మంచినీటికి జనం కటకటలాడుతున్నారని, మరోవైపు కరెంటులేక చీకట్లో కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాలని శ్రీమతి విజయమ్మ పార్టీ నాయకులు, శ్రేణులకు సూచించారు.