ఎస్పీవై రెడ్డికి అనర్హత తథ్యం: సోమయాజులు

26 May, 2014 13:30 IST
హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ‌అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీ కండువా కప్పుకున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి అనర్హత వేటు తథ్యమని పార్టీ సలహాదారు డీఏ సోమయాజులు అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్తే రాజ్యాంగం ప్రకారం అనర్హులవుతారని ఆయన గుర్తుచేశారు. ఎస్పీవై రెడ్డి  ఆదివారం ఉదయం ఢిల్లీలో టీడీపీలో చేరిన అనంతరం సోమయాజులు స్పందించారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి అనైతిక చర్యకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఆయన అన్నారు.

గుర్తింపు లేనందున వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వదిలి టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డికి తిరుగుబాటు నిబంధన వర్తించదని యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సోమయాజులు ఖండించారు. కామన్ గుర్తు ఉన్నప్పటికీ అభ్యర్థులను స్వతంత్రులుగానే గుర్తిస్తార‌న్న యనమల వాదనను ఆయన తూర్పారపట్టారు. ఎన్నికలలో పోలైన ఓటింగ్ శాతాన్ని బట్టి వై‌యస్ఆర్‌సీపీ గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని యనమలే పేర్కొనడం గమనార్హం.