నోట్ల రద్దుతో పస్తులుంటున్నారు

1 Dec, 2016 17:59 IST
  • నల్లకుబేరులను వదిలి సామాన్యులపై ప్రతాపమా..?
  • బ్లాక్ మనీతో దొరికినా బాబుపై చర్యలు తీసుకోలేదే..?
  • నోట్ల రద్దుతో వ్యవస్థ కుప్పకూలింది
  • రైతులు, కూలీలు పస్తులుంటున్నారు
  • డిసెంబర్‌ 31 నాటికి పరిస్థితి సరిదిద్దండి
  • భేషజాలకు పోకుండా అందరితో చర్చించండి
  • వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్ః నల్లధనం వెలికితీత పేరుతో నరేంద్ర మోడీ 130 కోట్ల మంది భారతీయులను రోడ్డున పడేశారని తెలంగాణ రాష్ట్ర వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు పేరుతో కేంద్రం తీసుకున్న ఈ చర్యతో దేశవ్యాప్తంగా నిర్మాణ, ఉత్పాదక రంగాలు కుదేలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది కూలీలు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. ముందుగా కేంద్రం తమ దగ్గర ఉన్న నల్లకుబేరుల అకౌంట్‌లను సీజ్‌ చేసి వారిపై చర్యలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం ప్రకటించి ఉంటే బాగుండేదని సూచించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ప్రతిపక్షాలపై బీజేపీ విమర్శలు దారుణం
ప్రజాసమస్యలపై గొంతెత్తి పోరాడుతున్న ప్రతిపక్షపార్టీలపై ఆరోపణలు గుప్పించడం దారుణమన్నారు. దేశంలోని ఏ పార్టీ నల్లధనం వెలికితీతకు అడ్డు చెప్పలేదని అయితే కేంద్రం అనుసరించిన వ్యూహాలు సరిగాలేవని మాత్రమే హెచ్చరించాయని ఆయన వెల్లడించారు. ప్రత్యామ్నాయాలు చూపించడంలో ఘోరంగా విఫలమైన ఆ పార్టీ దేశభక్తి పేరుతో ఎదురుదాడి చేయడం ఆందోళనకరమన్నారు. ఒక్క సిమెంట్‌ లోడుమీద ఆధారపడి దాదాపు 200 మంది బతుకుంటే ఇప్పుడు వారంతా పనుల్లేక ఆకలితే అలమటిస్తున్నారని పేర్కొన్నారు. మోడీ తీసుకున్న చేతకాని నిర్ణయంతో దేశం మొత్తం అలమటిస్తుందన్నారు. ఇప్పటికైనా తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం మాని ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో దృష్టి పెట్టాలన్నారు. డిసెంబర్‌ 31 నాటికి సమస్య నుంచి ప్రజలను గట్టెక్కించాలని కోరారు. జనాభాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత దేశంలో బ్యాంకుల్లో మిగిలి ఉన్న కేవలం నాలుగు లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు ఎలాగ కొనసాగిస్తారో తెలియజెప్పాలన్నారు. 

దిక్కుమాలిన చర్య అన్నావ్‌గా కేసీఆర్‌
మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట దిక్కు మాలిన చర్యగా చెప్పిన కేసీఆర్‌ తర్వాత ఢిల్లీకి వెళ్లి మోడీని పొగిడి రావడం సిగ్గు చేటన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో రబీ సీజన్‌ మొదలవుతున్నా రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నాట్లు వేయడానికి డబ్బుల్లేవు.. రుణాలు తెచ్చుకుందామంటే బ్యాకులు రానివ్వవు. వాళ్లంతా ఎలా బతకాలని ప్రశ్నించారు. క్యూలైన్‌లో నిల్చుని మరణించిన వారికి పార్లమెంట్‌లో మౌనం ప్రకటించి వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదే..
ఓటుకు నోటు కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సూట్‌ కేసుల్లో నల్లధనంతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిపై బీజేపీకి అంతప్రేమ ఎందుకో తెలియజెప్పాలన్నారు.  పైగా అలాంటి అవినీతి పరుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రుల కమిటీకి అధ్యక్షుడిని చేయడం ఎంత వరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పెద్ద పెద్ద నల్లకుబేరులను వదిలిపెట్టి సామాన్యులపై మీ ప్రతాపం చూపిస్తున్నారని విమర్శించారు. పెళ్లిళ్లకు ముష్టి 2.5 లక్షలిచ్చి అందునా దేనికెంత ఖర్చు చేయాలో వారే నిర్ణయించడం ఏమైనా బాగుందా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు పెళ్లిళ్లు కూడా మీరే చేయొచ్చుగా అని ఎద్దేవా చేశారు. నల్లధనం వెలికితీతకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ దానికి తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యల్లోనే లోపాలున్నాయని సరిదిద్దుకోవాలని సూచించారు. భేషజాలకు పోకుండా ప్రతిపక్షాలు, మేధావులతో చర్చించి డిసెంబర్‌ 31 నాటికి పరిస్థితులను చక్కదిద్దాలని పేర్కొన్నారు.