ప్రజలు నిలదీస్తారని టీడీపీ నేతలకు భయం
29 Dec, 2017 13:46 IST
కడప: ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పోలీసుల రక్షణలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని వైయస్ఆర్ జిల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విమర్శించారు. పోలీసుల రక్షణలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టండని వైయస్ఆర్ జిల్లా కలెక్టర్ చెప్పడం దారుణమని వైయస్ఆర్ సీపీ నేతలు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది జన్మభూమి నుంచి ఇప్పటి వరకు ఒక్క అర్జీని కూడా టీడీపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్ కార్డుకానీ, ఇళ్ల స్థలాలు, ఫించన్లు కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. జననేత వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్రను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రతో టీడీపీ పునాదులు కదలడం ఖాయమన్నారు. టీడీపీ నేతల అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.