చిదంబరంతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు

18 Oct, 2012 03:29 IST

ఇడుపులపాయ, 18 అక్టోబర్ 2012 :  చంద్రబాబునాయుడు చీకట్లో చిదంబరంతో రహస్య ఒప్పందాలు చేసుకుని కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కు అయ్యాయనేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని ఆమె అన్నారు. జగనన్నకు బెయిలు వస్తుందనుకుంటే చంద్రబాబు తన ఎంపీలను పంపి చిదంబరంతో మాట్లాడించారనీ, ఆ వెనువెంటనే ఆస్తుల జప్తుకు ఇడి ఆదేశాలు వెలువడ్డాయనీ ఆమె గుర్తు చేశారు. జగనన్న పై పలు కేసులు పెట్టగా చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై కేసులు లేకుండా చేసుకున్నారని ఆమె నిప్పులు చెరిగారు.
'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు ముందుగా ఆమె గురువారమిక్కడ జరిగిన ఒక భారీ బహిరంగసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే ప్రతిపక్షం చోద్యం చూస్తోందని ఆమె విమర్శించారు. ఎన్నికలకు ముందు రెండు వాగ్దానాలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధంపై ప్రజలను మోసం చేశారని షర్మిల గుర్తు చేశారు.
విద్యుత్ బిల్లులు చెల్లించలేని రైతులపై కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టించారనీ, ఆ అవమాన భారంతో వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారనీ చెబుతూ ఆపాపం చంద్రబాబుది కాదా? అని షర్మిల ప్రశ్నించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అన్నిటీ విఫలమైన ఈ చేతగాని ప్రభుత్వంపై 'అవిశ్వాసం తీర్మానం' ఎందుకు పెట్టడం లేదని ఆమె సూటిగా నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తప్ప, మూడో పార్టీ ఉండకూడదని కుట్ర పన్నుతున్నాయని, జగన్ ప్రజల మధ్య ఉంటున్నారనే జైల్లో పెట్టించారనీ షర్మిల అన్నారు.