మాటలు కాదు, చేతల్లో చూపండి: తమ్మినేని

22 Sep, 2014 15:32 IST

హైదరాబాద్, సెప్టెంబర్ 19: సీఎం చంద్రబాబు  పారదర్శక పాలన, జవాబుదారీతనం వంటివి కేవలం మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎద్దేవా చేసింది. పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటివరకు చంద్రబాబు  నోటి నుంచి ఎప్పుడూ వినిపించే ఈ మాటలకు, వాస్తవంగా జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని తెలిపారు.

అధికారంలోకి రాగానే రేషన్ దుకాణదారులను, అంగన్ వాడీ కార్యకర్తలను, ఉపాధి ఫీల్డు అసిస్టె౦ట్లను తొలగి౦చడ౦ పారదర్శక  పాలనా? అని ప్రశ్ని౦చారు. రెండు నెలల కాలంలో శ్రీకాకుళం జిల్లాలోనే 324 రేషన్ షాపు డీలర్లను తొలగి౦చారని చెప్పారు. అధికారులకు కేవలం ఈ రెండు నెలల కాలంలోనే వారిలో అంత అవినీతి కనిపించిందా? అని ప్రశ్ని౦చారు.

మధ్యాహ్న భోజన పథకంలో నెలకు వెయ్యి రూపాయలు గౌరవ వేతనం పొందే వంట వారిని సైతం రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. పరిపాలనలో గాడిలో పెట్టడమంటే ఇదేనా చంద్రబాబు ? అని నిలదీశారు. " సీఎం హోదాలో స్వయంగా చంద్రబాబు  కలెక్టెర్లు, ఎస్పీల సమావేశంలో అధికారుల్ని తమ పార్టీ
కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరించమని ప్రకటన చేశారు. అప్పటినుంచి ప్రత్యర్ధి పార్టీలపై దాడులు పెరిగిపొయాయి.

రాజ్యాంగబద్దమైన కలెక్టెర్ల సమావేశంలో నిస్సిగ్గుగా ఇలాంటి ప్రకటనలు చేయడమే మీ పారదర్శకతా? దీనిపైన ఎవరైనా చర్చకు వస్తారా? హత్యారాజకీయాలపై సీబీఐ విచారణకు సర్కారు సిద్ధంగా ఉందా? అని ప్రశ్ని౦చారు.