రాజధాని రైతులకు వైఎస్సార్‌సీపీ అండ

10 Jul, 2015 18:24 IST

గుంటూరు: రాజధాని ప్రాంత రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోంది. అక్కడి వ్యవసాయ దారుల్ని పీక్కొనితినేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకొంది. అక్కడి భూముల్ని లాక్కొని రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు పంచే క్రమంలో ఈ ఏర్పాట్లు చేసుకొంది. తాజాగా అక్కడ వ్యవసాయాన్ని నిలిపివేయాలని కుట్ర చేసింది. ప్రభుత్వంపై పోరాడి వ్యవసాయం చేసుకొనేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నానికి వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది.

 భూములే లక్ష్యం..!

 రాజధాని ప్రాంత రైతుల భూముల మీద ముందునుంచే రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడింది. అక్కడి భూముల్ని భయెపట్టి, బెదిరించి మరీ లాక్కొనేందుకు ప్రయత్నించింది. అంగీకార పత్రాలు ఇచ్చిన వారు కొందరైతే, ఇచ్చాక తిరిగి ఇవ్వమని అడిగిన వారు మరికొందరు, అసలు ఈ పత్రాలు ఇవ్వకుండా ఎదురు తిరిగిన వారు మరికొందరు ఉన్నారు. రక రకాలుగా కుట్రలు చేసి ఈ భూముల్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం దఫ దఫాలుగా కుట్రలు చేసింది. అంతిమంగా భూముల స్వాధీనానికి తెర దీసింది.

      ఈ లోగా సీజన్ గడచింది. ఖరీఫ్ సీజన్ రావటంతో పంటల సేద్యానికి రైతులు సమాయత్తం అయ్యారు. పంటల సాగు మొదలైతే భూముల్ని లాక్కోవటం కష్టం అని ప్రభుత్వం భావించింది. ఇందుకు విరుగుడుగా ఈ ప్రాంతంలో సేద్యం వద్దంటూ ముందుగానే నిషేదాజ్ఞలు విధించింది. అనధికారికంగా ఆంక్షల్ని అమలు చేసింది.

 ముందస్తు కుట్ర

 ఈ దిశగా ముందుగానే కుట్ర చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు సమాయత్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది.అంటే ఆయా ప్రాంతాల్లో వ్యవసాయానికి కావల్సిన అంశాల మీద కసరత్తు అన్నమాట.. వ్యూహాత్మకంగా గుంటూరు జిల్లా జాబితాలో మంగళగిరి, తాడేపల్లి మండలాల పేర్లను ఈ జాబితా నుంచి తొలగించారు.అంటే అక్కడ సాగు ఉండరాదని ఈ ఏడాది మే లోనే నిర్ధారణకు వచ్చేశారు. అటు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాల మంజూరు ని నిలిపివేశారు. ఈ దిశగా బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు. మరో వైపు ఎరువులు, పురుగు మందుల డీలర్ల మీద ఒత్తిడి పెట్టారు. రాజధాని ప్రాంత డీలర్లకు ఎరువుల సరఫరాను నిలిపివేశారు. ఇన్ని రకాల చర్యలు ఒక్కసారిగా తీసుకోవటం ద్వారా రైతుల మీద తీవ్రంగా ఒత్తిడి తేగలిగారు.

 రైతులకు వైఎస్సార్ సీపీ అండ

 ఇన్ని ఆంక్షలు పెడుతున్నా,  ఆ ప్రాంతంలోని కొందరు రైతులు ఎదురు తిరిగారు. ప్రభుత్వం నోటికాడ కూడు లాగేసుకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు విరుగుడుగా వ్యవసాయం చేయటమే సరైన చర్య అని భావించారు. అటు హైకోర్టు కూడా వ్యవసాయానికి అడ్డుతగల వద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రైతులు వ్యవసాయానికి దిగారు. అయినా సరే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధికారులు రైతుల్ని అడ్డుకోవటం మొదలెట్టారు. 

      మొదట నుంచీ రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్‌సీపీ ఈ దశలో కూడా రైతుల్ని ఆదుకొంది. మంగళగిరి శాసనసభ్యుడు రామకృష్ణా రెడ్డి నాయకత్వంలో ఉద్యమ బాట పట్టారు. రైతులకు మద్దతుగా స్వయంగా నాగలి దున్ని, విత్తనాలు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో సాగు చేసుకొనేందుకు సమాయత్తం అవుతున్నారు.

      ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ కే మాట్లాడుతూ.. రైతుల్ని ఆదుకొన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్సార్ మొదట గా ఉంటారని ఉదహరించారు. కానీ ఈ ప్రభుత్వానికి రైతులంటే గిట్టడం లేదని విమర్శించారు. రైతులకు వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.