అక్రమ ధనార్జన కోసమే

16 Nov, 2015 15:44 IST
బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం..
తక్షణమే జీవో నం.97ను రద్దు చేయాలి..

విశాఖపట్నం: జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక వారిని నిరాశ్రయులను చేయడంపై మండిపడ్డారు.
ధనదాహంతో చంద్రబాబు అమాయక గిరిజనుల ప్రాణాలను  పణంగా పెడుతున్నారని నిప్పులు చెరిగారు. దీన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు గిరిజనుల కోసం ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదని  విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  

విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు... ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి ఇస్తామని  చెప్పి చంద్రబాబు వారిని మోసపుచ్చారని బొత్స ఫైరయ్యారు.  డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి వ్యాధులకు  ఆరోగ్య భీమా, ఇళ్లులేని వారికి లక్ష 50 వేల రూపాయలతో  ఇళ్లు, భూమి లేని గిరిజనులకు 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారన్నారు. అక్రమ ధనార్జన కోసం గిరిజనుల ప్రాణాలు పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.  

బాక్సైట్ తవ్వకాల  విషయాన్ని ప్రధాని, రాష్ట్రపతి  దృష్టికి తీసుకెళ్తామన్నారు.  డిసెంబర్ 2న చింతపల్లిలో తమ అధ్యక్షులు వైఎస్  జగన్ బహిరంగ సభ జరుగుతుందని..ఈసందర్భంగా, గిరిజనులకు పార్టీ పరంగా మద్దతు ప్రకటిస్తారని బొత్స చెప్పారు. గిరిజనులకు మద్దతుగా ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని బొత్స స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నెల 24న అనంతపురంలో, 28 కాకినాడలో జగన్ ఆధ్వర్యంలో యువభేరి సభలు ఉంటాయని ప్రకటించారు. ప్రతి జిల్లాలో సభలు నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.