బాబు డొల్లతనం బయటపడుతోంది

30 Nov, 2017 17:28 IST



– పోలవరం కేంద్రమే నిర్మించాలి..మీరేందుకు తీసుకున్నారు
– కాంట్రాక్టర్లను మార్చడం వల్ల కేంద్రం అభ్యంతరం చెబుతోంది
– బాబూ నీ తాబేదారుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతారా?
– ప్రతిపక్షంపై ఆడిపోసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు
–వైయస్‌ హయాంలోనే పోలవరానికి అనుమతులు
– మెట్రోకు అంకురార్పణ చేసింది నేనే అని బాబు చెప్పుకోవడం విడ్డూరం
– రేపు విశాఖకు సముద్రం తెచ్చింది కూడా తానే అంటారేమో?
 

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై కేంద్రం అభ్యంతరం తెలపడంతో బాబు డొల్లతనం బయటపడుతోందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చర్యలతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, ప్రతిపక్షంపై ఆడిపోసుకోవడం తప్ప టీడీపీ నాయకులు చేసింది ఏమీ లేదన్నారు. గురువారం విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ఆ నాడు పోలవరాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు పక్క రాష్ట్రాల నాయకులతో కోర్టులో పిటీషన్లు వేయించారన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరానికి జాతీయ హోదా దక్కిందన్నారు. కేంద్రమే ఈ ప్రాజెక్టు కట్టాల్సి ఉండగా చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పోలవరం విషయంలో కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నారు. ఇష్టారాజ్యంగా పోలవరం టెండర్లు తన బినామీలకు, స్నేహితులకు కట్టబెట్టి నిధులు స్వాహా చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలు బయటపడటం వల్లే కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందన్నారు. ఓరిస్సా రాష్ట్రం కూడా ప్రధానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలో ఎన్నో సందర్భాల్లో పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలని మేం చెప్పామన్నారు. కానీ మేం త్వరితగతిన కడుతామని చంద్రబాబు చెప్పి పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారన్నారు. అన్నింటిని రాష్ట్రప్రభుత్వమే నిర్వర్తిస్తుందని నాడు చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. పోలవరం అథారిటీ అధికారిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఏపీకి చీఫ్‌ సెక్రటరీగా ఉన్నారన్నారు.

పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు
పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఈ మూడున్నరేళ్ల కాలంలో చేసిన అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉంటున్న బీజేపీ ఎందుకు మీరు కోరిన పనులు చేయడం లేదని నిలదీశారు. మీ అవినీతి కారణంగానే వారు చేయడం లేదా? మీ చేతకాని తనమేనా అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ను మీ బినామీలు, స్నేహితుల కోసం తాకట్టు పెడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై ఎన్నో మార్లు మా నాయకుడు  అసెంబ్లీలో మాట్లాడితే అవాకులు, చవాకులు పేల్చుతున్నారని తప్పుపట్టారు. ఆ నాడు పోలవరం కట్టడం ప్రతిపక్షానికి ఇష్టం లేదని ఆరోపించారన్నారు.  ఉత్తర కుమారుడిలా మీ ఇరిగేషన్‌ శాఖమంత్రి గొప్పగా చెప్పారని, శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టారన్నారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎందుకు కేంద్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని నిలదీశారు. విశాఖ రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీ ఆగిపోయిందని వీటిని సాధించలేని చేతకాని ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఎంతసేపు గ్రాఫ్‌లు, విదేశీ యాత్రలతో కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచిపోయిందని, ఇంకెప్పుడు చేస్తారని నిలదీశారు.  పోలవరం విషయాన్ని దాటవేసే విధానం సరికాదని, సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. టెండర్లలో ఒక విధానం రూపొందిస్తే దాన్ని పాటించకపోవడానికి కారణమేంటీ అన్నారు. మీ వెబ్‌ సైట్‌లో దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. విభజన చట్టంలోని అంశాలను ఇంకెప్పుడు సాధిస్తారని, ఇంకా ఏడాది మాత్రమే మీకు అవకాశం ఉందన్నారు. 

ప్రజలకు అన్నీ తెలుసు
ఎవరి హయాంలో ఏ కార్యక్రమం జరిగిందో ప్రజలకు అన్నీ తెలుసు అని బొత్స సత్యనారాయణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మెట్రోకు అంకురార్పణ జరిగితే చంద్రబాబు తన వల్లే అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చర్యలు రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. ఎవరి హయాంలో ఏ కార్యక్రమాలు జరిగాయో ప్రజలకు తెలుసు అన్నారు. రేపు విశాఖకు సముద్రం తెచ్చింది కూడా నేనే అంటారేమో అని బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు.