బీజేపీని తొక్కిపెడుతున్న చంద్రబాబు

4 Dec, 2015 14:18 IST
కమలానికి చంద్రబాబు షాక్ ట్రీట్ మెంట్
ఫ్లై ఓవర్ శంకుస్థాపన విషయంలో చంద్రబాబు జిమ్మిక్కులు
ఫ్లెక్సీల్లో ప్రధాని ఫోటో లేకుండా జాగ్రత్తలు
ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం కేంద్రం నిధులు మంజూరు 
అంతా తమ ఘనతేనంటూ టీడీపీ ప్రచారం
అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కమలదళం

విజయవాడ: చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో రాష్ట్రంలోని కమలనాథులు కుదేలయిపోతున్నారు. బీజేపీని తొక్కిపెడుతూ రాష్ట్రంలో చేపట్టే ప్రతి ప్రచార కార్యక్రమాల్లో చంద్రబాబు తన సొంత డబ్బా కొట్టుకుంటుండడంతో ఏపీ కమలనాథులు మండిపడుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్ శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ టీడీపీ-బీజేపీ మధ్య మంట పుట్టిస్తోంది. ప్లెక్సీలో ప్రధాని నరేంద్రమోడీ ఫోటో పెట్టకపోవడంపై కమల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం నిధులతో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నప్పటికీ ...ప్రధాని నరేంద్రమోదీ  ఫోటో పెట్టకుండా శంకుస్థాపన చేసేందుకు వస్తున్న కేంద్రమంత్రులు నితీన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు....చంద్రబాబు, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ల ఫోటోలు పెట్టారు. మరికొన్ని ఫోటోల్లో లోకేష్, ఎన్టీఆర్ ఫోటోల వద్ద చిన్నదిగా ప్రధాని ఫొటోను ఉంచారు. దీంతో, బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.ప్రధాని ఫొటో కంటే ముఖ్యమంత్రి ఫొటో పెద్దగా ఉండడంపై గరంగరం అవుతున్నారు. టీడీపీ నేతలు కావాలనే ప్రధానిని చిన్నచూపు చూస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పచ్చనేతల తీరుపై సీరియస్ గా ఉన్న కొంతమంది బీజేపీ నేతలు ఇప్పటికే  ఫ్లెక్సీలను వీడియో తీయించి, ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు.  కేంద్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్‌కు రూ.282 కోట్లు ఇస్తే.. ఈ విషయాన్ని పక్కన పెట్టి ప్లై ఓవర్ సాధించిన ఘనత తమదేనని టీడీపీ నేతలు చెప్పుకోవడంపై కమలదళం మండిపడుతోంది.  ఫ్లై ఓవర్ మంజూరైన సందర్భంగా చంద్రబాబును పొగుడుతూ బుద్దా వెంకన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంపై కమలటీం భగ్గుమంటోంది. రాష్ట్రానికి రూ.కోట్లు ఇచ్చిన నరేంద్రమోదీని పక్కన పెట్టి చంద్రబాబునాయుడు, బుద్దా వెంకన్న ప్రజల్లో హైలైట్ అవుతున్నారంటూ ఇప్పటికే బీజేపీ నేతలు ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇదిలా ఉంటే గడ్కరీ చేత శంకుస్థాపన కార్యక్రమం చేయించకుండానే... అధికారులు పనులు ప్రారంభించడంపై కమలనేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.