పార్టీలో చేరిన బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు
ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరు రఘురామ కృష్ణంరాజు, తెనాలి మాజీ ఎం.పి. వల్లభనేని బాలశౌరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయదశమి రోజు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కృషి చేయాలని శ్రీ జగన్ వారిని కోరారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వారి అనుచరులు తరలివచ్చారు.
సమైక్యాంధ్ర కోసమే పార్టీలో చేరా: రఘురామ కృష్ణంరాజు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం శ్రీ జగన్ సూచనల మేరకే తాను పది రోజుల క్రితం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానన్నారు. అది దసరా సెలవుల తరువాత విచారణకు వస్తుందన్నారు. వచ్చే దసరా నాటికి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఉంటారన్న ధీమాను ఆయన వెలిబుచ్చారు. కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని సమైక్యవాదులు కూడా శ్రీ జగన్‌కు పూర్తి మద్దతు ఇస్తారన్నారు. శ్రీ జగన్ సాహసం, పట్టుదల కలిగిన నాయకుడు అని, అందుకే ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు.
జగన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం: బాలశౌరి
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణించాక రాష్ట్రం అల్లకల్లోలమైపోయిందని, ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరమని బాలశౌరి అన్నారు. అందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. విభజనకు అనుకూలంగా టిడిపి ఇచ్చిన లేఖను అలుసుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిందని విమర్శించారు. రఘురామ కృష్ణంరాజుతో పాటు ఉండికి చెందిన నరసింహరాజు, బాలశౌరితో పాటు థామస్‌నాయుడు, దుర్గాప్రసాద్ పార్టీలో చేరారు.
బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు చేరిక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గంటూరు జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎం.నాగార్జున, రావి వెంకట రమణ, రాతంశెట్టి రామాంజనేయులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), లేళ్ళ అప్పిరెడ్డి, అనూప్ శేషగిరిరావు, రాజేంద్రప్రసాద్, షౌకత్, నసీర్ అహ్మద్, జి.చిన వెంకటరెడ్డి, ఎం.విజయలక్ష్మి, అనసూయ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, గ్రంథి శ్రీనివాస్, జిల్లా నాయకులు తోట గోపి, చీర్ల రాధయ్య, మల్లు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.