ముద్రగడ ప్రాణాలతో బాబు చెలగాటం.. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు

17 Jun, 2016 11:08 IST

కాకినాడ) మాజీమంత్రి, కాపునాయకుడు ముద్రగడ ప్రాణాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చలగాటమాడుతున్నట్టుగా  కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ముద్రగడకు ఎలాంటి హాని జరిగినా అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిం చాల్సి ఉంటుందని హెచ్చరించారు.    ఒక వైపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరుపుతూనే, మరో వైపు మంత్రులు ఎగతాళిగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఈ అనుమానం కలుగుతోందని కాకినాడలో అభిప్రాయ పడ్డారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. సమస్యను కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారని కన్నబాబు తప్పుబట్టారు. ముందురోజు రాత్రి డీఐజీ చెప్పిన మాటలకు, ఉదయాన్నే మంత్రులు రాజప్ప, గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోయాయన్నారు. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడతో ఓ వైపు అధికారులు, కాపు జేఏసీ చర్చలు జరుపుతూ కొలిక్కి వస్తున్న నేపధ్యంలో మంత్రుల తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేయకుండా సమస్యను జటిలం చేసే విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ప్రభుత్వ పెద్దల తీరు మారకపోతే ఉద్యమం పక్కదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా పంతాలకు పోకుండా న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించేదిశగా ప్రభుత్వం చొరవ చూపాలని కన్నబాబు కోరారు.