దర్యాప్తు రిపోర్టులు బయటపెట్టే ధైర్యం బాబుకు లేదు

2 Jul, 2018 16:05 IST

రాష్ట్రంలో వివిధ అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించిన విచారణలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరికీ అర్థం కావడం లేదని పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి అన్నారు. ఏ ఒక్క విచారణ నివేదికను ఇంతవరకు ప్రభుత్వం బయటపెట్టలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన అంశాలే కాకుండా, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను వంచించడమే కాకుండా, పాలనా పరంగా కూడా విచారణ నివేదికలు బయటకు రాకుండా దగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన వంచన పై గర్జన దీక్ష లో ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

 ఎన్‌టీ రామారావుని చంపి ఆయన ఫొటోతోనే రాజకీయాలు చేస్తున్న ఘనత బాబుది. ఆయన్ను చూసి పైనుంచి ఎన్‌టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది. నాలుగేళ్లుగా చంద్రబాబు రాష్ట్రానికి చేసిన వంచన అంతా ఇంతా కాదు. 15 దేశాలు తిరిగి ఇప్పటికీ తాత్కాలిక రాజధాని కట్టలేదు. ఆయన కట్టిన నాలుగు బిల్డింగులు చూస్తే బయట కంటే లోపలే ఎక్కువే నీరు కారిపోతోంది. చంద్రబాబు సమర్థవంతమైన పాలన చేసుంటే ఇంటికో నిరుద్యోగి ఉండేవాడు కాదు. ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించే సీఐఐ సదస్సుల పేరుతో ఆయన చేసింది అడ్వర్‌టైజ్‌మెంట్‌ మాత్రమే. ఏరువాక పున్నమి ఏ సంతోషంతో చేసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టేదానికి దోమలపై దండయాత్ర, ఏరువాక పున్నమి లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకుని ఓటేయాలని ప్రమాణం చేయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే ఉంటాడు చరిత్రలో. బాబు నాలుగేళ్ల పాలనలో బాగు పడింది జిరాక్సు సెంటర్‌ నిర్వాహకులు, ఉపయోగపడింది చంద్రన్న సంచీ. అంతే తప్ప దేశానికి ఉపయోగపడింది లేదు. 

రెండు పేపర్లు, నాలుగు టీవీలు అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. అగ్రి గోల్డ్‌ బాధితులకు న్యాయం  చేసేందుకు ఏర్పాటు చేసిన ఎక్వయిరీ, గోదావరి పుష్కరాల ఎంక్వయిరీ, శేషాచలం అడవుల్లో 20 మంది తమిళుల కాల్చివేతపై ఎంక్వయిరీ, విశాఖ భూ కబ్జాపై సీఐడీ ఎంక్వయిరీ ఏమైంది.. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై సీఐడీ ఎంక్వయిరీ, కృష్ణా నది మీద బోటు ప్రమాదంలో సీఐడీ ఎంక్వయిరీ పూర్తికాలేదు. వారి మీద వేసుకున్న ఎంక్వయిరీ రిపోర్టులు బయటపెట్టలేని దౌర్భాగ్యం చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో ఈ రాక్షస పాలనకు అంతం పలికి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వలోని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం.