చంద్రబాబు నమ్మక ద్రోహి

29 Apr, 2018 11:21 IST
ప్రత్యేక హోదాను ఉరి తీసిన ఘనుడు చంద్రబాబుకుట్రకు పేటెంట్ రైట్ చంద్రబాబుదే

విజయవాడ  ప్రత్యేక  హోదా కోసం చంద్రబాబు  ధర్మపోరాటం చేస్తానననడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఏప్రిల్ 30 వ తేదీన రాష్ట్ర ప్రజలను ఫూల్స్ ను చేయడానికే టిడిపి డ్రామాలకు పూనుకున్నారన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబును నమ్మక ద్రోహి అనడంలో ఎంతమాత్రం తప్పులేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ఎంత అన్యాయం చేసిందో, అంతకు నాలుగు రెట్లు అధికంగా చంద్రబాబు ద్రోహం చేశారన్నారు.

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, టిడిపి వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారన్నారు. హోదా పదేళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని చెప్పి నాలుగేళ్లపాటు దానిని మరచిపోయారని, మరిచిపోయినట్లు నటించారన్నారు.  విభజన చట్టంలోని అంశాలను సాధించకుండా వంచించిన వారిని నమ్మక ద్రోహం కాదా అని, అందుకు వారిని నమ్మక ద్రోహులు అనాలా వద్దా చెప్పాలని అడిగారు.

హోదా కోసం పోరాడిన వైయస్ ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై కేసులుపెట్టి ఉద్యమాన్ని అణగ దొక్కాలని చూసి, ఇప్పుడు ధర్మ పోరాటమంటూ డ్రామాలు చేయడం నీచమన్నారు.  కుట్ర రాజకీయాలకు పేటెంట్ రైట్ చంద్రబాబుదే అని ప్రజలందరికీ తెలుసునని, అయితే ఇప్పుడు హోదా రాకుండా కుట్రు పన్నుతున్నారంటూ బాబు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ముఖ్యమంత్రి పదవి కోసం వెన్నుపోటు, పార్టీ అధ్యక్ష పదవి కోసం కుట్ర చేసిందెవరో అందరికీ గుర్తుందని, అలాగే వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై కేసులు పెట్టాలంటూ చీకట్లోచిదంబరం కాళ్లు పట్టుకున్నది, సోనియాగాంధీ ముందు మోకరిల్లిన చంద్రబాబు కుట్రలు బహిరంగ రహస్యాలేనన్నారు.

 ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, పక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్ర చేసి దొరికిపోయిన కుట్రదారులు , ఇప్పుడు కుట్రలు చేస్తున్నారంటూ గగ్గొలు పెట్టడం వింతగా ఉందన్నారు.

ఇప్పుడు కూడా కేవలం నియోజకవర్గాల సంఖ్యలను పెంచితే చాలు హోదా వద్దంటూ ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి కుట్రకు పాల్పడిందెవరో ప్రజలకు స్పష్టంగా తెలుసుని రోజా అన్నారు.

గతంలో ఉద్యమాలను అణిచివేస్తూ కుట్ర రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబు చెప్పే మాటలకు చేసే చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని రోజా విమర్శించారు. ప్రత్యేక హోదా ను ఉరి తీసిన ఘనుడు చంద్రబాబు అయితే, దానిని సజీవంగా నిలిపిన నాయకులు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇటీవలచంద్రబాబు చేసిన దీక్ష ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను తలపించింది తప్పితే, అందులో సీరియస్ నెస్ లేదన్నారు. ఇప్పుడు కూడా ఏప్రిల్ 30 వ తేదీన మరోసారి ప్రజలను ఫూల్స్ చేయడానికే ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని ఆరోపించారు.

 ప్రత్యేక హోదా రాకుండా వైయస్ ఆర్ కాంగ్రెస్ అడ్డుపడుతోందంటూ, మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలు వ్యాఖ్యానించడాన్ని రోజా తీవ్రంగా తప్పుపట్టారు. ఇది సిగ్గుమాలిన రాజీకీయమంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా హోదా కంటే, ప్యాకేజి ముద్దని, ప్యాకేజిని స్వాగతిస్తూ తీర్మానం చేసినప్పుడు , నిరసన వ్యక్తం చేసిన వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వ్యవహరించిన తీరును మరచిపోయి ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేట్టన్నారు.

పార్లమెంటులో ఇచ్చిన హామీ అమలు కాకపోవడంపైనా, పార్లమెంటులో చర్చకు రాకుండా నాలుగేళ్ల పాటు బిజెపితో అంటకాగి, మంత్రివర్గంలో కొనసాగి డ్రామాలు చేసిన మీరు ఇప్పుడు సాధించేదేమిటిని టిడిపిని నిలదీశారు. ఇప్పటికి కూడా బిజెపితో దోస్తానా కొనసాగిస్తూ, బిజెపి వారికి పదవులిస్తూ, వారితోనే పోరాటం చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టేయత్నాలు చేయడం నమ్మక ద్రోహం కాక మరేమిటని ఆమె ప్రశ్నించారు.