బాబు, లోకేష్‌ జైలుకే

17 Feb, 2017 15:25 IST
  • వైయస్‌ జగన్‌ను భౌతికంగా అంతమొదించేందుకు ప్రభుత్వం కుట్ర
  • టీడీపీ మూడేళ్ల పాలనలో రూ.2 లక్షల కోట్ల అవినీతి
  • ఎన్నికల హామీలను విస్మరించిన సర్కార్‌
  • ప్రతి వర్గానికి బాబు బకాయిపడ్డారు
  • బేరసారాలు నడిపిన సీఎం ప్రావీణ్యమంతా ప్రజలు చూశారు
  • ఎంతసేపు వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేయడమే టీడీపీ నేతల పని
  • నాయకుడంటే వైయస్‌ఆర్‌లా ఉండాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదారాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంతూరు వెళ్లినా కూడా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జపమే చేస్తున్నారని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఎంతసేపు ప్రతిపక్ష నేతపై అభాండాలు వేయడం తప్ప..టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పే దమ్మూ, ధైర్యం బాబుకు లేదని ఆమె విమర్శించారు. టీడీపీ మూడేళ్ల పాలనలో రూ. 2 లక్షల కోట్ల అవినీతి చోటు చేసుకుందని, వీటిపై విచారణ జరిపితే చంద్రబాబు, లోకేష్‌ జైలుకు వెళ్లడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ అయిన ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ పోరాడుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన హామీని అడగాల్సిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో వైయస్‌ జగన్‌ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని మాట్లాడారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ తన ప్రజల మధ్య నేను ఈ మంచి పనులు చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు. కుప్పం వెళ్లినా కూడా వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తే తప్ప గెలవలేనన్న భయం బాబుకు పుట్టుకుంది. వైయస్‌ఆర్‌ పాలనలో కుప్పం ప్రజలకు ఏమిచ్చారు. బాబు వచ్చాక ఏం చేశారో ఒక్కమాటైనా చెప్పగలరా బాబూ. మీ నియోజకవర్గం వెళ్లి కూడా వైయస్‌ జగన్‌ జైలు నుంచి రాలేడని చెప్పుతున్నారు. 

అసలు మీ ఎజెండా ఏంటీ?
చంద్రబాబు ప్రభుత్వ ఎజెండా ఏంటీ?. రాజకీయ నాయకులకు మనసాక్షి అన్నది ఉందా అన్న అనుమానం కలుగకమానదు. ఓటుకు కోట్లు కేసులో బాబు అడ్డంగా దొరికిపోయారు. ప్రత్యక్షంగా ప్రజలు చూసిన సందర్భంలో దొరికిన దొంగే ఎందుకిలా మాట్లాడుతున్నారు. మీ శీలం, నిజాయితీని శంకించే మరో కారణం ఏంటంటే ..మా ఇద్దరు ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. రాజకీయ వ్యభిచారం చే శారు. బేరసారాలు నడపడంలో మీరు చూపిన ప్రావీణ్యం అంతా ప్రజలు చూశారు. ఈ రోజు మేం ఒక్కటే అడుగుతున్నాం. పరిపాలన గురించి మీరు చెప్పడం లేదు. ఈ మూడేళ్లలో ఇంత గొప్పగా అభివృద్ధి చేశానని, కొత్త రాష్ట్రానికి దిశానిర్దేశం చేశానని చెప్పగలవా? ఎంత సేపు మీ మంత్రులు, మీరు ప్రజల మధ్యకు వస్తే చాలు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నారు. అంతం చేస్తామన్న మాటలు తప్ప వేరే ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రజల మధ్య నిలబడి ఇంత అద్భుతంగా చేశానని చెప్పే ధైర్యం ఉందా? రైతులు, డ్వాక్రా మహిళలు మీ వద్దకు వస్తే వడ్డీలు కట్టలేక ఎలా ఇబ్బందులు పడుతున్నారో మొరపెట్టుకునే పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులకు రెండు వేల నిరుద్యోగ భృతీ ఏదీ బాబు అని నిలదీస్తున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదు. మీరిచ్చిన హామీ ప్రకారం బకాయిలు ఉన్నారని అడుతున్నారు. మీలా బకాయిపడ్డ నాయకుడు దేశంలో ఎవరూ లేదు. ప్రతి ఒక్కరికి బకాయిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండరని ప్రజలను భయపెడుతున్నారు. హోదా కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌పై అంభాడాలు వేయడం మీకు తగునా? . ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు.  గతేడాది మేలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వేసిన అవినీతి చక్రవర్తి చంద్రబాబు అనే పుస్తకం వేశాం. ఈ మూడేళ్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగింది. ఈ కేసుల్లో ఒక్కదానిపై విచారణ జరిగినా మీరు జైలుకు వెళ్తారు. ఇవాళ శశికళ కేసును పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు ఏపీలో  అధికారంలో ఉన్నది ఎవరు. ఎవరి హయాంలో రూ.2 లక్షల కోట్ల అవినీతి ఎవరి హయాంలో జరిగింది. సీఎం కుమారుడు లోకేష్‌ ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారో అందరికి తెలుసు. మీ హయాంలో జరిగే అవినీతికి శిక్షలు ఉండవని మీరనుకుంటున్నారా?  ఏ పాలన వ్యవహారంలో జోక్యం చేసుకొని వైయస్‌ జగన్‌పై కేసులు ఉన్నాయని ఇరికించారో, ఈ మూడేళ్లలో విచ్చలవిడిగా ఏపీని ఒక మాఫియా రాజ్యం చేశారు. వాగ్ధానం అన్నది ఒక నాయకుడిని నుంచి వస్తే అది అమలు అవుతుందని అనుకుంటారు. దివంగత మహానేత అలాంటి వాగ్ధానాలు నెరవేర్చారు. 2009లో చంద్రబాబును జైలులో పెట్టి ఎన్నికలకు వెళ్లలేదు.  ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లి రెండే రెండు వాగ్ధానాలు చేశారు. 20 కేజీల రేషన్‌ బియ్యం 30 కేజీలకు పెంచుతానని, ఉచిత విద్యుత్‌ ఆరుగంటలను 9 గంటలకు పెంచుతామని చెప్పారు. గత ఎన్నికల్లో చెప్పినవి చేశాం, చెప్పనివి చేశామన్నారు. 2004లో మేనిఫెస్టోలో పెట్టని  104, 108, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలను అమలు చేశారు. ఆయన్ను ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. నాయకుడంటే అలా ఉండాలి. కోట్ల రూపాయాలు నల్లధనంతో లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ అయిన చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారు.

ఎందుకంత భయం? 
వైయస్‌ జగన్‌ లేకుండా చేయలని కోరుకోవడం రాజకీయాల్లో సమంజసమేనా? ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల్లో ఎదుర్కొంటానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఇది చేతకాని తనానికి నిదర్శనం కాదా? ఎందుకింత భయపడుతున్నారు. టీడీపీ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు, ధనం మూటలు చంద్రబాబుకు కాన్ఫిడెన్స్‌ ఇవ్వలేకపోతున్నాయి. బాబు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం శూన్యమే. ఆయన వెనుక ప్రజలు లేరు. ప్రజలకు మేలు చేయని నాయకుడిని మళ్లి సీఎంను చేయరు. బాబు తన నీడను చూసి భయపడుతున్నారు. జనం కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారు. మీరు వైయస్‌ జగన్‌పై మాత్రమే పోరాటం చేస్తున్నారు. ఆయనను కనపడకుండా చేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కేంద్రం కాళ్లు పట్టుకుంటున్నారు. మీ సర్వం ఎజెండా ఒక్కటే..మీరు వైయస్‌ జగన్‌ను జైలుకు పంపాలన్నదే మీ ఎజెండా. మీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నీటి కోసం వ్యాసాలు చేయలేని ఇరిగేషన్‌ మంత్రి ప్రతిపక్ష నేతను తిట్టేందుకు వ్యాసాలు రాస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే నోరు వెళ్లబెట్టే దేవినేని ఉమ ..ఇవాళ వైయస్‌ జగన్‌పై వ్యాసాలు రాయడం ఎంతవరకు సమంజసం. ప్రతిపక్ష నేతను బూచిగా చూపించి ఎన్నికలకు వెళ్లే నాయకుడిని ఏమంటారు. అవినీతి అన్నది వార్డు మెంబరు నుంచి సీఎం దాకా మాఫియా మించి నేర సామ్రాజ్యంగా మీరు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులను ఎట్లా చూడాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు ఎవరిపై పోరాటం చేస్తున్నారో టీడీపీ తేల్చుకోవాలి. దీన్ని రాజకీయమంటారా? సమ ఉజ్జిల మధ్య జరుగుతున్న పోరాటంలా లేదు. నిజమైన నాయకుడిగా వ్యవహరించండి. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని మేం ఆశిస్తున్నాం.