బాబును చూస్తే జాలేస్తోంది: మేకపాటి
2 Oct, 2012 03:49 IST
హైదరాబాద్, 2 అక్టోబర్ 2012: చంద్రబాబు నాయుడి పరిస్థితిని చూసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి జాలిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ళ కాలంలో ఏ ఒక్క రోజైనా ఒక్క మంచి పని అయినా చేసి ఉంటే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో గుడి కట్టి కొలిచినట్లే బాబును కూడా ప్రజలంతా దేవుడిలా కొలిచేవారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాలో మాట్లాడారు.
ప్రజలలో విశ్వాసం కోల్పోయిన తర్వాత ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని సినిమా సీన్లు పండించినా లాభం ఉండబోదని రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జనహితం కోరే ప్రజా నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లాలే గానీ వారిని ఎలా మభ్య పెట్టాలా అని ధోరణితో కాదని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. 'వస్తున్నా... మీ కోసం' అంటూ నేటి నుంచి చంద్రబాబు నిజంగా జనం సమస్యలు తెలుసుకునేందుకే వెళ్తుంటే సినిమా దర్శకుల దగ్గర సలహాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేకపాటి తెలిపారు.