'బాబు హయాంలో ఛిద్రమైన చేనేత'

26 Oct, 2012 19:07 IST
అనంతపురం:

టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు తొమ్మిదేళ్ళ పరిపాలనలో రైతులు, చేనేత కార్మికుల బతుకులు చిధ్రమయ్యాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ మండిపడ్డారు. మరో ప్రజా ప్రస్థానం అనంతపురం జిల్లాకు చేరిన సందర్భంగా ధర్మవరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ఆప్కో దుస్థితిని ఆమె సవివరంగా తెలిపారు.  చంద్రబాబు హయాంలో ఆప్కో మూతపడిందన్నారు. ధర్మవరంలో చేనేత బతుకులు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన హాయంలోనే బెల్టు షాపులు వెలిశాయనీ, వాటిని బాబే ఆద్యుడనీ ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి, చేనేత వస్త్రానికి మద్దతు ధర లేదని ఆరోపించారు. నూలు, మగ్గం, షెడ్డు సౌకర్యాలు కల్పిస్తామని వైయస్ఆర్ హామీ ఇచ్చారన్నారు. అధికారులు కూడా వారంలో ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలని వైయస్ ఆదేశించిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. ప్రభుత్వం  ఆ హామీలను గాలికొదిలేసిందన్నారు. అనంత రైతులకు గతంలో ఉన్న 32 టీఎంసీల నీటిని ఇప్పుడు 23 టీఎంసీలకు కుదించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తాగునీటి పథకాలన్నీ దిష్టిబొమ్మల్లా తయారయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో పంటలకు, తాగడానికి నీరు లేని దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ ప్రజల మధ్యలో ఉండి వారి కష్టాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీలో అనంతపురం జిల్లా వాటాగా 555 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులకు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్ హయాంలో 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆమె చెప్పారు.  నేడు 108 సర్వీసుకు ఫోను చేస్తే డీజిల్ లేదని చెపుతున్నారన్నారు. 104 సర్వీసు పూర్తిగా మూలనపడిందన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగునీటి పథకాన్నీ దిష్టిబొమ్మల్లా తయారయ్యాయన్నారు. కిరణ్ ప్రభుత్వానికి చంద్రబాబే సలహాదారని విజయమ్మ చెప్పారు.