ప్రజా సమస్యలపై అధికారులు దృష్టిసారించాలి
కావలి: నియోజకవర్గ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్ ముత్యాలరాజును కలిసి త్రాగునీటి సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా త్రాగునీటి కోసం అన్ని చెరువులకు సోమశిల జలాలు పంపిణీ చేయాలన్నారు. తుమ్మల పెంట సీపీడబ్ల్యుఎస్ ద్వారా నీరు సరఫరా కావడం లేదని చెప్పారు. 53 గ్రామాలలో ఇంకా 20 గ్రామాలకు పైప్ లైన్ వేయలేదని, తాత్కాలికంగా వెంటనే తుమ్మల పెంట , తాళ్లపాలెం చెరువులకు నీటిని పంపి తీరప్రాంత ప్రజలకు పైలెట్ ప్రాజెక్టు బోర్ల కు నీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మందాటి చెరువును సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా మార్చుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. జక్కేపల్లి గూడూరు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణ పనిని త్వరగా పూర్తి చేసి అల్లిమడుగు, తెల్లగుంట, ఉమామహేశ్వర పురం గ్రామాలకు వచ్చే సంవత్సరనికైనా త్రాగునీరు అందించాలని కోరారు. ముసునూరు 926 సర్వే నెంబర్‌లో గల పట్టాదారులకు సరైన స్థలం చూపించకపోవడంతో లబ్దిదారులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారని, వారి సమస్యను పరిష్కరించాలన్నారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలో డయాలసిస్ సెంటర్, సదరమ్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిల్లో వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.