పోరాడే దమ్ముందా గురివింద బాబు
21 May, 2016 16:37 IST
తెలంగాణ ప్రాజెక్టు కాంట్రాక్టర్ బాబు బినామీ
ప్రతిపక్షనేతపై మంత్రి దేవినేని చౌకబారు విమర్శలు
బాబు అక్రమాలపై సీబీఐ విచారణ వేయించాలి
ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను టీడీపీ కార్యాలయంగా మార్చారు
తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల కాంట్రాక్టులు మావికాదు
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ పడి తెలంగాణ ప్రాజెక్టులు సజావుగా నిర్మించేందుకు సహకరిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఏపీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమా వైయస్ఆర్ సీపీ నేతలపై చేసిన ఆరోపణలకు ఆయన గట్టిగా సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వైయస్ఆర్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ముందుకు వచ్చి దీక్ష చేస్తే, మంత్రి దేవినేని ఉమా రాజకీయల లబ్ధి కోసం దొంగ దీక్ష అంటూ హేళన చేయడాన్ని ఆయన ఖండించారు. ఎవరు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని దేవినేని ఉమకు సూచించారు. గాలి వార్తలు తీసుకొని వచ్చి వైయస్ జగన్‌పై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు.
ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ వారే అధికం
తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాంట్రాక్టు దక్కించుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ సీపీ నేతలు మిథున్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలకు వైయస్ జగన్ కాంట్రాక్ట్ లు ఇప్పించారంటూ దేవినేని చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. బాబుకు అత్యంత సన్నిహితుడు, బాబు ఖర్చులన్ని భరించే నవయుగ కాంట్రాక్ట్ యజమానే తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టుల్లో కొన్ని అర్హతలు తక్కువగా ఉన్నాయని నవయుగ కాంట్రాక్ట్ యజమాని కోరితే 20 శాతం జేవీ (జాయింట్ వెంచర్) ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీనివాస్‌రెడ్డికి కూడా 20 శాతం జేవీ ఇచ్చామన్నారు. సంబంధం లేకుండా వైయస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని ఫైరయ్యారు. దేవినేని ఉమకు శక్తియుక్తులు ఉంటే వాస్తవాలు తెప్పించుకొని పరిశీలించిన తరువాత మాట్లాడాలని హెచ్చరించారు. ఎంపీ మిథున్‌రెడ్డి తెలంగాణలో 2008లో టెండర్ వేసిన ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టు మాత్రమే చేపట్టారని, ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఒక్క ప్రాజెక్టు తప్ప తెలంగాణలో ఏ పనులు చేయడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కుప్పంలో రోడ్డు కాంట్రాక్టులు చేపడుతున్నాం.. హంద్రీనీవా ప్రాజెక్టు మూడు ప్యాకేజీలు చేస్తున్నాం.. అంతమాత్రాన చంద్రబాబుతో మేం లాలూచీ పడినట్టా..? లేక చంద్రబాబు వైయస్ జగన్మోహన్రెడ్డితో లాలూచీ పడి పనులు ఇచ్చినట్టా..? అని మంత్రిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా ఉన్నారా..లేరా అని మంత్రి ఆలోచించుకోవాలన్నారు.
దీక్ష చేసేంత వరకు పాలకపక్షం మేల్కొన లేదు
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి దీక్ష చేసేంత వరకు కూడా చంద్రబాబు ప్రభుత్వం మేల్కొన లేదని పెద్దిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, నీటి పారుదల శాఖామంత్రిని ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం దీక్ష చేసిన వైయస్ జగన్‌పై దేవినేని మాటల దాడికి దిగడం దుర్మార్గమన్నారు. ప్రాజెక్టులపై జాతీయ స్థాయిలో అపెక్స్ కమిటీ ఉంటుందని చెప్పారు. ఆ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు మెంబర్లుగా ఉన్నారని వివరించారు. ఆ అపెక్స్ కమిటీ ముందు చంద్రబాబు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసీఆర్‌తో లాలూచీ పడ్డారన్నారు. ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడై చార్జిషీట్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న బాబు ఎందుకు ఇంత వరకు కోర్టుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ పేరుతో ప్రభుత్వ భూమిని తీసుకొని.. దాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చితే కేసీఆర్ ఎందుకు చంద్రబాబుపై విచారణ జరిపించలేదని నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్కంపెనీ, ఐఎంజీల కేసులను ఎందుకు సీబీఐకి అప్పగించలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టపెట్టారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు చేసుకుంటూ.. వచ్చిన డబ్బుతో రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నాం కానీ తెలుగుదేశం పార్టీ నేతల మాదిరి ప్రజల సొమ్మును దోచుకొని దాచుకోవడం లేదని దేవినేనికి సూచించారు. గురువింద గింజ.. తన కింద ఉన్న నలుపును తెలుసుకోనట్లుగా చంద్రబాబు తప్పులన్ని తన కింద ఉంచుకొని ప్రతిపక్ష వైయస్ఆర్ సీపీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నీటి హక్కులను కాపాడాలని సవాల్ విసిరారు.