నాటకీయంగా సురేష్ ను వదిలిన ఖాకీలు..!

5 Nov, 2015 17:52 IST
వారం రోజులుగా చిత్రహింసలు..!
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు..!
టీడీపీ నేత వద్ద వదిలేసిన పోలీసులు..!

గుంటూరుః రాజధాని ప్రాంతంలో పంటలు తగలబెట్టించిన పచ్చనేతల పైశాచికత్వం పరాకాష్టకు చేరుకుంది. తమ పంట తామే తగలబెట్టుకున్నామని ఒప్పుకోవాలంటూ వారం రోజులుగా సురేష్ ను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు..నాటకీయ పరిణామాల మధ్య వదిలిపెట్టారు. తమ కుమారుడి ఆచూకీ చెప్పడం లేదంటూ తండ్రి  రాములు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. చెరకు తోట దహనమైన కేసుకు సంబంధించి పూర్తివివరాలు తమ ముందుంచాలని హైకోర్టు గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించడంతో ఖాకీలు సురేష్ ను వదిలేశారు.

మంగళవారం సాయంత్రం నుంచి సురేశ్ కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి అతడిని తీసుకెళ్లాలంటూ పోలీసులు హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఎస్.ఐ. రవిబాబు బుధవారం సురేశ్‌ను తెలుగుదేశం పార్టీకి చెందిన తుళ్ళూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర వద్ద విడిచి వెళ్లారు. సురేశ్‌ను జెడ్పీటీసీ సభ్యుడి వద్ద ఎలా వదిలి వెళతారంటూ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.

ల్యాండ్ పూలింగ్‌కు పొలం ఇవ్వలేదన్న అక్కసుతో తెలుగుదేశం నేతలు మల్కాపురంలోని చంద్రశేఖర్  చెరకు పంటను దహనం చేశారు. స్పందించిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంఘటనా స్థలానికి వెళ్లి కాలిన పంటను పరామర్శించారు.  వైఎస్ జగన్ తనను పరామర్శించి ప్రభుత్వ తీరును తప్పు పట్టడాన్ని జీర్ణించుకోలేకే...ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి మేనల్లుడు సురేష్, తనను కేసులో ఇరికించారని చంద్రశేఖర్ వాపోయాడు. 

గత నెల 29వ తేదీ న విచారణ పేరుతో సురేశ్‌ను తీసుకెళ్లి డీఎస్పీ విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని చంద్రశేఖర్ తెలిపారు. తానే ఈ పంట దగ్ధానికి పాల్పడినట్లుగా సురేశ్‌చేత రాయించుకుని సంతకాలు చేయించి సెల్‌లో వీడియో రికార్డు చేసినట్లు చెప్పారు.  రాజధాని ప్రాంతంలో 13 చోట్ల పంట పొలాల్లో వెదురు బొంగులు దగ్ధమైన సంఘటనలకు సంబంధించిన కేసులను సైతం... సురేశ్‌పై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.