ఏపీ సర్కార్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు..!

5 Nov, 2015 14:43 IST
అనుమతులు లేకుండానే నిర్మాణాలు ..!
కోర్టు ధిక్కరణపై ట్రిబ్యునల్ ఆగ్రహం..!
వారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశం..!

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ..రాజధాని నిర్మాణం పేరుతో భూదందాకు పాల్పడుతున్న ఏపీ సర్కార్ కు గట్టిషాక్ తగిలింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,  సీఆర్డీఏ, కేంద్రపర్యావరణ శాఖలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు ఇచ్చింది. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే అడ్డగోలుగా అటవీ భూములను స్వాధీనం చేసుకొని చదును చేస్తున్న ప్రభుత్వ తీరుపై....కృష్ణా జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ ఎన్జీటీలో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ వారం రోజుల లోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. 

అంతా మీ ఇష్టమేనా..!
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... అటవీ భూములకు సంబంధించిన వాటిపై న్యాయవిచారణ చేపట్టే అధికారిక సంస్థ. ఎవరైనా ట్రిబ్యునల్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కింద విచారణకు స్వీకరిస్తుంది. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు దోచుకున్న టీడీపీ సర్కార్, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే అటవీ భూములను కాజేసేందుకు ప్లాన్ వేసింది. ఐతే, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలోనే ట్రిబ్యునల్ ఓసారి ఉత్తర్వులు ఇచ్చింది. ఐనా కూడా ప్రభుత్వం ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణాలకు సిద్ధమైంది. దీంతో,  పర్యావరణ చట్టాలు, నిబంధనలను కాలరాస్తున్న ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీమన్నారాయణ గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. 

పర్యావరణ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ట్రిబ్యునల్ ఆదేశించినా..దాన్ని పెడచెవిన పెట్టారని పిటిషనర్ పేర్కొన్నారు. పర్యావరణ శాఖ పర్మిషన్ ఇస్తే సీఆర్డీఏ, కాలుష్యనియంత్రణ బోర్డు, పర్యావరణ శాఖ ఆవివరాలు తమ వెబ్ సైట్ లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. అక్టోబర్ 9న పర్యావరణ అనుమతులు వచ్చాయని చెప్పిన ప్రభుత్వం..10వ తేదీన ఎన్జీటీలో జరిగిన విచారణలో ఈవిషయాన్ని ఎందుకు చెప్పలేదని, ఏఫ్రిల్ లో 5,500 ఎకరాలు ఎందుకు చదును చేసినట్లని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం తప్పుడు అఫిడవిట్లతో ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తుందని వాదించారు.