చింతమనేనిని అరెస్ట్ చేయాలి
7 Dec, 2015 16:02 IST
అనంతపురంః మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాలకు నిరసనగా అంగన్ వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన చింతమనేనిని అరెస్ట్ చేయడంతో పాటు, శాసససభ సభ్యత్వం రద్దు చేయాలని అంగన్ వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చింతమనేనిని జైల్లో పెట్టేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా అంగన్ వాడీ కార్యకర్తల సంఘం ఇవాళ కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో చింతమనేనికి వ్యతిరేకంగా లిఖిత పూర్వక ఫిర్యాదు చేసింది. డిమాండ్ల సాధన కోసం నిరసనకు దిగిన మహిళలపై చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నారీమణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈక్రమంలోనే అన్ని జిల్లాల్లోనూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవలే ఏలూరులోనూ చింతమనేని అరెస్ట్ కు పట్టుబడుతూ అంగన్ వాడీలు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.