టిడిపి దిగజారుడు విమర్శలు : అంబటి
కాంగ్రెస్ పార్టీతో కలవాలనుకుంటే తమ పార్టీ అధినాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి 14 నెలలుగా జైలులో ఉండాల్సిన అవసరం ఏముందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై అంబటి తీవ్రంగా ప్రతిస్పందించారు. గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతున్న టిడిపి నాయకులు దిగజారిపోయి విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే కాపాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మిగతా ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెట్టినప్పుడు బాబు మద్దతిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఉండేది కాదని, రాష్ట్రానికి ప్రస్తుత విపత్కర పరిస్థితులు వచ్చేవే కావని అంబటి చెప్పారు.
ఎఫ్‌డిఐ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కు టిడిపి ఎంపిలను గైర్హాజరు చేయించి అది ఆమోదం పొందేలా చేసిన ఘనుడు కూడా చంద్రబాబే అని అంబటి రాంబాబు గుర్తుచేశారు. ఇంత బహిరంగంగా కాంగ్రెస్‌తో టిడిపి కలిసి మెలిసి పనిచేస్తూ పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ... ఆ బురదను శ్రీ జగన్‌పై చల్లడం యనమలకే చెల్లిందని దుయ్యబట్టారు. అవిశ్వాస తీర్మానం దగ్గరి నుంచి రాష్ట్ర విభజన అంశం వరకూ చంద్రబాబు తరచూ కాంగ్రెస్ అధినేతలతో సంప్రదిస్తూ సంబంధాలు కలిగి ఉన్నారని ఇటీవల ‘హిందుస్థాన్ టైమ్సు’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని అంబటి ఉదహరించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరి మధ్య ఉన్నదీ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రాంబాబు ప్రశ్నించారు.