పుట్టి మునిగిపోకుండా చూసుకోడానికే అఖిల పక్షం

27 Mar, 2018 13:13 IST
చంద్రబాబుతో చర్చల వల్ల అర్థం లేదు
అవిశ్వాసం వేళ అఖిల పక్షమా?
లోకసభ సభ్యుల రాజీనామాలకే కట్టుబడి ఉన్నాం
వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత ధర్మాన 

హైదరాబాద్: ఇంతకాలం ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తీరని అన్యాయం చేసిన చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైందనీ,  పుట్టి మునిగి పోతున్న ఈ సమయంలో తనను ఎవరో  ఒకరు పైకి తేవాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అఖిల పక్షాన్ని పిలుస్తున్నారని వైయస్ ఆర్ సీపీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 

ప్రత్యేక హోదా సాధనలో అధికార పక్షంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో ప్రధానప్రతిపక్షంగా తమ పార్టీ అవిశ్వాసం, రాజీనామాల వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న తరువాత 
అఖిల పక్ష చర్చలతో సాధించేదేమీ ఉండదని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో చర్చించి, నిర్ణయించిన మేరకు ఎంపిలు రాజీనామాలు చేసి ప్రజా తీర్పును కోరతామని ఆయన స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ముందుండి నాయకత్వం వహించాల్సిన చంద్రబాబు నాయుడు దాదాపు మూడున్నరేళ్ల  ఆలస్యంగా మేలుకొన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదనే భావనతో,  సింగపూర్‌ తరహాలో ప్రతిపక్షం అనేది లేకుండా ఉండాలని అనేక సార్లు తన ఆకాంక్షను వెలిబుచ్చుతూ,  వైయస్‌ఆర్‌ సీపీ సభ్యులను కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. వారిని మంత్రులుగా తీసుకుని  రాజ్యాంగ వ్యవస్థలను తొక్కేస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎంత అడ్డగోలుగా హత్య చేశారో ప్రజలందరికీ తేటతెల్లంగా తెలుసన్నారు. సొంత ప్రయోజనాల కోసం హోదాను కాదంటూ ప్యాకేజికి సిద్ధపడిన చంద్రబాబు, ఇప్పుడు ప్రజాగ్రహానికి తలొగ్గి యుటర్నులు తీసుకుంటూ ప్రజల పక్షాన నాయకత్వం తీసుకునేందుకు  అర్హత కోల్పోయారని మండిపడ్డారు. 

లోకసభలో  అవిశ్వాసం చర్చకు వచ్చే సమయంలో అఖిల పక్షం అంటున్నారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నది చంద్రబాబే. రాజధాని విషయంలో ఒక్కరోజైనా ప్రతిపక్షాన్ని సంప్రదించారా? ప్రజాసంఘాలతో ఎప్పుడైనా చర్చించారా? రాజధాని తన కుటుంబ వ్యవహారంగానే చూశారు. పోలవరం విషయంలో ఎప్పుడైనా అఖిలపక్షంతో సంప్రదించారా? ’ అని చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.  హోదాకు బదులుగా కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వచ్చినట్లు చెప్పింది మీరే కదా..? అని అడిగారు.

ప్రతిపక్షం చేస్తున్న పోరాటాలకు తలొగ్గి, ప్రజా ఆగ్రహాన్ని చవి చూడలేకనే కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి వైదొలిగిందన్నారు.  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో పాలకపక్షం వైఫల్యం వల్లే ఆ బాధ్యతను ప్రతిపక్షం భుజానకెత్తుకుందని , ఇప్పుడు  ‘మీరు చేయాల్సింది అఖిలపక్షం ఏర్పాటు కాదు.. టీడీపీ ఎంపీలతో రాజీనామా’ అని చంద్రబాబుకు  సూచించారు. రాష్ట్రం చెడిపోవడానికి, అవినీతి పెరగడానికి చంద్రబాబే కారణమన్నారు. ఇలాంటి చంద్రబాబుతో చర్చించడంలో అర్ధముందా..? అని సూటిగా అడిగారు.