27, 28 తేదీల్లో షర్మిల నేతృత్వంలో నిరసనలు
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించి ఏడాది కావస్తున్న సందర్భంగా ఆయన సోదరి శ్రీమతి షర్మిల సారథ్యంలో 27, 28 తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ సీఈసీ సభ్యుడు, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధించి ఈ నెల 27 కు ఏడాది అవుతుందని గుర్తు చేశారు.
ఈ నెల 27వ తేదీన శ్రీమతి షర్మిల నాయకత్వంలో వేలాది మందితో నరసాపురంలో కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన చేస్తామని ప్రసాదరాజు చెప్పారు. మరుసటి రోజు 28న పాలకొల్లులో నిరసనదీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని, శ్రీమతి షర్మిల కూడా దీక్షలు పాల్గొంటారని చెప్పారు.
నిరసనలను విజయవంతం చేయండి :
బుట్టాయగూడెం: శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి ఈ నెల 27 నాటికి సంవత్సరం కావస్తోందని, దీనికి నిరసనగా 27, 28 తేదీల్లో ర్యాలీ, దీక్ష చేపడుతున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. త్వరలోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని, రాజన్న స్వర్ణయుగం పాలన అందిస్తారని చెప్పారు.